HYD: నగరం నడిబొడ్డున నిర్మాణాలు.. అధికారులకు తలనొప్పిగా ఆ అంశం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు సమీపంలోని కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్డు నెం.12(విరంచీ హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్కు వరకు) రోడ్డు విస్తరణ పనుల్లో ఆస్తుల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది.

HYD: నగరం నడిబొడ్డున నిర్మాణాలు.. అధికారులకు తలనొప్పిగా ఆ అంశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు సమీపంలోని కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్డు నెం.12(విరంచీ హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్కు వరకు) రోడ్డు విస్తరణ పనుల్లో ఆస్తుల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే వీటి భూసేకరణలో భాగంగా ఇచ్చే పరిహారంగా కుండా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్టు తెలిసింది. రూ.1090కోట్లలో సగం నిధులు భూసేకరణకే అవుతున్నాయని అధికారులు లెక్కలేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు మెజార్టీగా టీడీఆర్ల రూపంలో ఇచ్చారు.

129 ఆస్తుల గుర్తింపు

కేబీఆర్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యతగా మహారాజా అగ్రసేన్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, రోడ్డు నెం.45 జంక్షన్లపై దృష్టి సారించారు. ఈ మూడు జంక్షన్లతో పాటు రోడ్డు విస్తరణ కలిపి 129 ఆస్తులను సేకరించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. వీటిలో ఈ మూడు జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. హారాజా అగ్రసేన్ జంక్షన్‌లో 34, ఫిల్మ్ నగర్ జంక్షన్‌లో 43, రోడ్డు నెం.45 జంక్షన్‌లో 36 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో 82 ఆస్తుల సేకరణకు జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ జారీచేసింది. వీటి విస్తీర్ణం 17,512.62 చదరపు గజాల వరకు ఉంటుంది. అత్యధికంగా ఫిల్మ్ నగర్ జంక్షన్‌లోనే కాంగ్రెస్ బీఆర్ఎస్, టీడీపీ నేతలకు చెందిన ఆస్తులు ఉన్నాయి.

టీడీఆర్ ఇలా..

జీహెచ్ఎంసీ చేపట్టనున్న ప్రాజెక్టుల్లో స్థలం కోల్పోతే భూసేకరణ చట్టం ప్రకారం అయితే మార్కట్ రేటు ఆధారంగా భూమికి రెండింతలు, నిర్మాణానికి రెండింతలు చెల్లించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదే టీడీఆర్ అయితే (ఉదా.20గజాల స్థలం కోల్పోతే 80గజాల స్థలానికి టీడీఆర్ ఇస్తారు). నాలుగింతల టీడీఆర్ ఇవ్వనున్నారు. దీన్ని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టీడీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో విముఖత వ్యక్తం చేసి, మళ్లీ దీనివైపు ఎందుకొస్తుందనే చర్చ జరుగుతున్నది.

ఎఫ్ఎస్ఐ అంటూ ప్రచారం..

టీడీఆర్ విషయంలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏరియాల ఆధారంగా డిమాండ్ వచ్చేలా నిబంధనలు రూపొందించడానికి సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు గతంలో మాదిరిగా ఆశించిన మాదిరిగా డిమాండ్ సైతం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీఆర్ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, ఒక వేళ కొనుగోలు చేసిన 25-30శాతం సైతం రావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story