Assembly: సభ సజావుగా జరిగేలా చూడండి.. అధికారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశాలు

by Ramesh Goud |

తెలంగాణలో రేపటి నుండి అసెంబ్లీ(Assembly), మండలి(Council) సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Assembly: సభ సజావుగా జరిగేలా చూడండి.. అధికారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపటి నుండి అసెంబ్లీ(Assembly), మండలి(Council) సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukendar Reddy) నేతృత్వంలో అసెంబ్లీ హాల్‌లో ముందస్తు సమావేశం(Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Duddilla Sridhar babu), మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahendar Reddy), సీఎస్ శాంతి కుమారి(CS Shanthi Kumari) సహా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ(Police Dept) అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని సూచించారు. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందించితే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని, సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. అంతేగాక సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలని, సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయని, సభ్యులు సమయానికి సజావుగా సభకు చేరుకోవడానికి రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు.

అలాగే కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమావేశాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ప్రోటోకాల్ విషయంలో వివాదాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని, శాసనమండలి పరిసరాలలో చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖది అని చెప్పారు. అలాగే పొరపాట్లు జరగకుండా, సభ సజావుగా జరిగే విధంగా సహకరించాలని, శాసన మండలి సమావేశాలు జరిగే సమయంలో అధికారులు తప్పక హాజరవ్వాలని, సమన్వయంతో రెండు సభలను సజావుగా నడిచేలా చూడాలని అన్నారు. ఇక శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, ప్రోటోకాల్ ఉల్లంఘన సంఘటనలపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story