కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ ముగింపు.. మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

ఒక దిశానిర్దేశం లేకుండా తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు ముగించారని, ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వలేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.

కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ ముగింపు.. మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక దిశానిర్దేశం లేకుండా తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు ముగించారని, ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వలేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు పారిపోయి, కేరళం ఎన్నికల కోసం అసెంబ్లీని అర్ధంతరంగా ముగించారని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా, ఏ ఒక్క అంశంపైనా ప్రభుత్వం చర్చకు రాలేదన్నారు. సభా సాంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలిచ్చారని.. నియమ నిబంధనలు, సభా మర్యాదలను, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యలపై సూటిగా సమాధానం చెప్పకుండా రేవంత్‌రెడ్డి తొండల భాష, కండల భాష వాడారని పేర్కొన్నారు. సభా నాయకుడి హోదాకు ఇది తగినది కాదన్నారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదన్నారు. సమయపాలన లేదని.. సభ అంటే గౌరవం లేదని.. శాసనసభను గాంధీభవన్‌లాగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీ నుంచి వస్తున్నారని ఏకంగా 4 గంటలు టీ బ్రేక్ ఇచ్చారని.. ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నారని 3 గంటల పాటు సభను ఆపి వెయిట్ చేయించారన్నారు.

హేట్ స్పీచ్ బిల్లు చివరి రోజు తెచ్చి..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే.. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారన్నారు. అవినీతి నుంచి మంత్రిని కాపాడటానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారన్నారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి ఎలాంటి చర్చ లేకుండానే ముగించారని తెలిపారు. గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల చెవిలో పూలు పెట్టింది మీరే అని అన్నారు. దళితులపై రేవంత్‌రెడ్డిది కేవలం కపట ప్రేమ మాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు సభలో కత్తుల కోలాటం ఆడుతాం, తలలు తీస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని పైల్వాన్ల భాష మాట్లాడుతుంటే.. సీఎం పక్కన కూర్చొని ప్రోత్సహించారని అన్నారు. రేవంత్‌రెడ్డి రెండేళ్లుగా సభలో మాట్లాడుతున్న భాష కూడా ఎథిక్స్ కమిటీకి వెళ్లాల్సిందేనని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే.. మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘దమ్ముంటే సీఆర్ పాటిల్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నేతలు మాతో రండి.. కాళేశ్వరం జలాలతో గలగలా పారుతున్న గోదావరి నీళ్లను, పండుతున్న పొలాలను చూపిస్తాం’ అని సవాల్ విసిరారు.

Next Story