అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాట (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2026-03-29 10:45:24  IST  )

తెలంగాణ అసెంబ్లీలో తల్లిదండ్రుల పోషణ బిల్లు-2026 ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పాడిన పాట సభలో భావోద్వేగ వాతావరణానికి దారి తీసింది.

అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాట (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తల్లిదండ్రుల హక్కులు కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ముందడుగు వేసింది. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు-2026’ను ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సభలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. 'అమ్మ నీకు వందనమే మా తల్లి నీకు వందనమే కన్నీళ్లు ఇంకెన్నాలే..' అంటూ పాడి వినిపించారు. ఈ పాటతో సభలో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది.

పెద్ద కొడుకుగా రేవంత్ రెడ్డి:

ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ ఈ బిల్లును తీసుకువచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మనం పంటి నొప్పినే భరించలేం. కానీ నవ మాసాలు తన బిడ్డను తన కడుపున మోసి, ఎముకలు విరిగితే కలిగేంతా బాధను భరిస్తూ ప్రసవించిన తల్లి తన బిడ్డలకు భారం అవుతుందంటే భాధగా ఉందన్నారు. నాన్న గురించి వర్ణించడానికి కవులకు సైతం సాధ్యం కాదన్నారు. ఎప్పుడూ ఏడ్వని నాన్న తన కూతుర్ని అత్తారింటికి పంపుతుంటే, కుటుంబం అప్పుల్లో ఉన్నప్పుడు, తన బిడ్డల ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్య ఏడుస్తాడు. అది నాన్న అంటే అని అన్నారు. ఈ చట్టం తీసుకురావడం ద్వారా తెలంగాణలోని వృద్ధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు అయ్యారని అన్నారు.

Next Story