మమత బెనర్జీ, స్టాలిన్ ఓటమి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మమత బెనర్జీ, స్టాలిన్ ఓటమి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు (SIR - Special Intensive Revision) ప్రక్రియ ప్రతిపక్షాల విజయ అవకాశాలను ఎలా దెబ్బతీసిందో ఆయన వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాతినిధ్యం వహించిన కొలత్తూరు నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (SIR) వల్ల సుమారు 31 లక్షల మంది ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీ స్వయంగా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన విశ్లేషించారు. ఇక తమిళనాడులో కూడా ఇదే తరహాలో ఓట్ల తొలగింపు జరిగిందని, స్టాలిన్ నియోజకవర్గమైన కొలత్తూరులో కూడా ఓటర్ల గల్లంతు అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యానికి ముప్పు..

కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఒవైసీ మండిపడ్డారు. ఈ 'SIR' ప్రక్రియ వల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని, దీనివల్ల ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఓట్ల గల్లంతుపై సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. బీజేపీ విజయం వెనుక ఇటువంటి సాంకేతిక పరమైన వ్యూహాలు కూడా ఉన్నాయని ఒవైసీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Next Story