- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర అన్యాయం: అసదుద్దీన్
ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ పనిచేస్తున్నదని, వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ పనిచేస్తున్నదని, వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని అన్నారు. ఈ బిల్లుతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఈ విషయంలో మోడీ మరోసారి ఆలోచించాలని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశానికి దేశ నలుమూలల నుంచి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు ముఖ్య సభ్యులు, వివిధ ముస్లిం సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని తెలిపారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింల ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో హింస చోటుచేసుకోవడంపై ఒవైసీ స్పందించారు. తాము హింసను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. నిరసనలు శాంతియుతంగా జరగాలని ఆయన సూచించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకతను తెలియజేయడం ముస్లింల హక్కు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 23, 26ను అడ్డుపెట్టుకొని వక్ఫ్ భూములను దోచుకునే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ బిల్లును తీసుకొస్తున్నదని ఆరోపించారు. ముస్లింలకు అన్యాయం చేసేందుకు బీజేపీ అనుబంధ పార్టీల నాయకుల మద్దతుతో ఈ బిల్లును రూపొందించారని అన్నారు. హిందూ ధర్మం, జైన ధర్మం, సిక్ ధర్మం బోర్డులో వారికి సంబంధించిన వారు మాత్రమే సభ్యులుగా ఉంటారని.. కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం ముస్లిమేతరుడిని ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. టీటీడీలో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగులుగా కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మరి వక్ఫ్ బోర్డ్‌లో ఇతర మతాలకు చెందిన వారిని ఉండేలా రూపొందించిన వక్ఫ్ బిల్లును ఎలా సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే.. వక్ఫ్ బిల్లు ప్రకారం వక్ఫ్ భూములు ఆక్రమించిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని.. సెక్షన్ 3డి ప్రకారం ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. వక్ఫ్ అంటేనే తన దృష్టిలో ప్రార్థనా స్థలమని పేర్కొన్నారు.






