- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరం.. స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలి సారిగా ప్రతిపక్షంలో ఉండి సైతం భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామనే రీతిలో ఇతర రాజకీయ పార్టీలకు సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల్లో నూతనుత్తేజం వస్తుందని, అటు ఇటు ఆలోచించే వారు, నిరాశ నిస్రృహల్లో ఉన్న వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుందని గులాబీబాస్ అంచనా వేస్తున్నట్టు తెలిసింది.
జిల్లాల వారీగా సమీక్షలు
సభను విజయవంతం చేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడిపోయినఅభ్యర్థులు, నేతలతో సమీక్షలు నిర్వహించారు. పార్టీలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న నేతలను యాక్టివ్చేశారు. ఏయే ప్రాంతాల నుంచి ఎంత మంది జనాన్ని సమీకరించాలనే విషయంపై వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రజలను తరలించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ఆర్టీసీ బస్సులను బుక్ చేయించారు. ఎల్కతుర్తిలో సభ స్టేజీ ఏ దిక్కున ఉండాలనే దానిపైనా అధినేత నిర్వాహకులకు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వాలంటీర్ల నియామకం, వేల సంఖ్యలో వచ్చే వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నేతలకు సూచనలు చేశారు.
నిరాశ, నిస్పృహలు దూరం చేసేందుకు..
పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కేడర్, లీడర్లలో కొంత నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. రాష్ట్ర స్థాయిలో కొంత హడావుడి జరుగుతున్నా కింది స్థాయిలో ఆ మేరకు స్పందన లేదనే విమర్శలున్నాయి. పార్టీ కేడర్సైతం అటు ఇటుగా ఉందని, కొందరు ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్లిపోయారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇలానే ఉంటే ఇబ్బంది తప్పదని భావించిన కేసీఆర్.. ఎల్కతుర్తి సభను విజయవంతం చేస్తే వీటన్నింటికీ బలమైన సమాధానం చెప్పొచ్చని ఉద్దేశంతో ఉన్నారని తెలిసింది. అందుకే దీనిని విజయవంతం చేసేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.
కేసీఆర్ ప్రసంగంపైనే ఆసక్తి
బీఆర్ఎస్ప్రతిపక్షంలోకి వచ్చాక నల్లగొండ, లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మాత్రమే కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన పెద్దగా బయట సభల్లో మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తి బహిరంగ సభలో కేసీఆర్ చేసే ప్రసంగంపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన చేసే ప్రసంగం వాడివేడీగా ఉండనుందా.. లేక సాదాసీదాగా సాగుతుందా?.. ఈ సభ ద్వారా అధినేత కొత్త నిర్ణయాలు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? అనేది ఉత్కంఠగా మారింది. అంతే కాకుండా ఆయన స్పీచ్‌తో పొలిటికల్ పార్టీల్లోనూ మరింత హీట్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






