- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరీ ఇంత ఖాళీగా ఉన్నారా..? ఫ్రీగా హలీమ్.. వందల సంఖ్యలో ఎగబడిన జనం
రంజాన్ మాసం ప్రారంభమైన వేళ పబ్లిసిటీ కోసం ఒక రెస్టారెంట్ ప్రకటించిన 'ఉచిత హలీమ్' ఆఫర్ కాస్తా భారీ గందరగోళానికి దారితీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రంజాన్ మాసం ప్రారంభమైన వేళ నగరంలో హలీమ్ సందడి మొదలైంది. అయితే, పబ్లిసిటీ కోసం ఒక రెస్టారెంట్ ప్రకటించిన 'ఉచిత' ఆఫర్ కాస్తా భారీ గందరగోళానికి దారితీసింది. మటన్ హలీమ్ ఫ్రీగా ఇస్తామన్న ప్రకటనతో జనం వందల సంఖ్యలో ఎగబడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నగరంలోని ‘వాహ్ మండి’ రెస్టారెంట్ యాజమాన్యం రంజాన్ ప్రారంభం సందర్భంగా ప్రచార నిమిత్తం ఉచితంగా మటన్ హలీమ్ పంపిణీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. ఈ వార్త నెట్టింట వేగంగా వ్యాపించడంతో, ఆఫర్ పొందేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. మండి ముందు వందల సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.
అదుపు తప్పిన పరిస్థితి..
ఉచితం కావడంతో జనం ఒకరిని నెట్టుకుంటూ ముందుకు వెళ్లడం కనిపించింది. చిన్న పిల్లలను సైతం వెంట పెట్టుకుని రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. జనాన్ని నియంత్రించడం హోటల్ సిబ్బంది వల్ల కాకపోవడంతో అక్కడ తొక్కిసలాట వంటి వాతావరణం నెలకొంది. హోటల్ యాజమాన్యం సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఏదైనా తొక్కిసలాట జరిగి ప్రమాదం సంభవిస్తే.. మళ్లీ ప్రభుత్వాలను, అధికారులను విమర్శిస్తారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఆఫర్లు అవసరమా?’ అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ‘జనాలు మరీ ఇంత ఖాళీగా ఉన్నారా?’ అని కొందరు ఎద్దేవా చేయగా, ‘ఇది ఫుడ్ జిహాద్ కాకపోతే అంతే చాలు’ అంటూ మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనప్పటికీ, పబ్లిసిటీ స్టంట్ల పేరుతో ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు అభప్రాయపడ్డారు.






