బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడ మళ్లింపులున్నాయంటే?

by Ramesh Naini |

బక్రీద్ పండుగ, నగరంలో మేకలు, గొర్రెల విక్రయాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక అడ్వైజరీ జారీ చేసింది.

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడ మళ్లింపులున్నాయంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బక్రీద్ పండుగ, నగరంలో మేకలు, గొర్రెల విక్రయాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. టోలిచౌకి - నానల్ నగర్ - రేతిబౌలి మార్గాలతో పాటు రేతిబౌలి నుండి అత్తాపూర్ రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి ఈ నెల 27, 28 తేదీలలో సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపుల వివరాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం, గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలు.. షేక్‌పేట ఫ్లైఓవర్ కింద నుండి ఫిల్మ్ నగర్ రోడ్డు ద్వారా లేదా ఫ్లైఓవర్ ర్యాంప్ దాటిన తర్వాత బృందావన్ కాలనీ రోడ్డు గుండా వెళ్లవచ్చు.లక్డీకాపూల్ నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు (సాయంత్రం 5 గంటల నుండి).. మాసాబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద కుడి వైపునకు తిరిగి, బంజారాహిల్స్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. మెహదీపట్నం నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు (సాయంత్రం 5 గంటల నుండి).. నానల్ నగర్ వద్ద ఎడమ వైపునకు తిరిగి, లంగర్ హౌస్, నార్సింగి రోడ్డు మీదుగా వెళ్లవచ్చు. మాసాబ్ ట్యాంక్ నుండి అత్తాపూర్ వైపు వెళ్లే వాహనాలు.. PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 2 & 3 వద్ద ఎడమ మలుపు తీసుకుని, మిరాజ్ కేఫ్ - గుడిమల్కాపూర్ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు సూచన..

రాత్రి సమయాల్లో మెహదీపట్నం - టోలిచౌకి మార్గంలో ప్రయాణించడాన్ని పూర్తిగా నివారించాలని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు పోలీసులు సూచించారు. ఈ వాహనాలు ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ద్వారానే ప్రయాణించాలని స్పష్టం చేశారు.

అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్

వాహనదారులు ట్రాఫిక్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్ పేజీ ([facebook.com/HYDTP](https://facebook.com/HYDTP)) మరియు ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ (@HYDTP)లను ఫాలో అవ్వాలని కోరారు. ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా లేదా ప్రయాణ సహాయం కావాలన్నా దయచేసి 9010203626 అనే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు. పౌరులందరూ ఈ ట్రాఫిక్ రద్దీ, మళ్లింపులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Next Story