- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనా..? మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నల వర్షం
గురుకులాకు గ్రీన్ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనా..? మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Gurukulas) గురుకులాకు గ్రీన్ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనా..? మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండదు అనడానికి గురుకులకు కేటాయించిన చాలీ చాలని నిధులు మరో ఉదాహరణ అని విమర్శించారు. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రూ. 12 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి.. ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం రూ. 100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? అని నిలదీశారు. కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? ప్రశ్నించారు.
మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో సిబ్బంది వేతనాలు, మోటార్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని సమీక్షలతో గురుకులాలకు ఏం ప్రయోజనం? అని నిలదీశారు. ఒకవైపు సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతుంటే తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించడం దుర్మార్గమన్నారు. గురుకులాలకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు, స్టిచ్చింగ్ ఛార్జీలు ఎప్పుడు చెల్లిస్తారు? అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు అద్దె బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? నెలలుగా పెండింగ్ లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారు? మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో ఈ సమస్యలకు పరిష్కారం ఎలా చూపుతారు? గణితం ఉపాధ్యాయులు నియమించాలని నిన్న మెదక్ జిల్లా చేగుంట గురుకులం విద్యార్థులు రోడ్డెక్కారు? పురుగులన్నం మాకొద్దు అంటూ నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు? గురుకులాల మీద ప్రభుత్వానికి పట్టింపు ఉంటే విద్యార్థులు ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
బడి పాట పట్టాల్సిన విద్యార్థులను, ఆందోళన బాట పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతిని దిగజార్చారని, విష వలయాలుగా మార్చారని ఆరోపించారు. గ్రీన్ చానెల్ లో గురుకులాలు, వసతి గృహాల బిల్లులు చెల్లిస్తామన్న మాటలు ఇంకెప్పుడు కార్యరూపం దాల్చుతాయన్నారు. గురుకులాల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు, గురుకులాల అద్దె బకాయిలు, నెలలుగా పెండింగ్ లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు, మెస్, కాస్మొటిక్, స్టిచ్చింగ్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని, 22 నెలలుగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






