Sajjanar : స్కూటీ ముందు పిల్లలను నిల్చోబెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక

by Ramesh Naini |

ద్విచక్ర వాహనాలపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.

Sajjanar : స్కూటీ ముందు పిల్లలను నిల్చోబెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ద్విచక్ర వాహనాలపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా స్కూటీల ముందు భాగంలో పిల్లలను నిల్చోబెట్టడం వల్ల ఎదురయ్యే ప్రాణాపాయంపై ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఒక విషాదకర ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. వాహనం ఆపినప్పుడు లేదా పిల్లలు దిగుతున్న సమయంలో వారు తెలియక యాక్సిలరేటర్ తిప్పితే అది ఘోర ప్రమాదానికి దారితీస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు. చిన్న అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ఇటీవలే ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు.

తల్లిదండ్రులకు కీలక సూచనలు..

ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు కచ్చితంగా కింది జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ‘బండి ఆపగానే వెంటనే ఇంజిన్ ఆపి, తాళం (Key) తీసేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లలు బండి దిగేటప్పుడు అకస్మాత్తుగా యాక్సిలరేటర్ తిప్పకుండా బ్రేక్ గట్టిగా పట్టుకోవాలి. వాహనానికి ఉన్న 'ఇంజిన్ కిల్ స్విచ్'ను వాడటం ద్వారా ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు’ అని సీపీ సూచించారు. ‘మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. గమనించండి.. ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి’ అని సజ్జనార్ కోరారు.

Next Story