Sarpanch Elections: సీఎం ప్రాతినిధ్య మండలాల్లో ఏకపక్షంగా ఫలితాలు

by Prasad Jukanti |

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు పైచేయి సాధించారు.

Sarpanch Elections: సీఎం ప్రాతినిధ్య మండలాల్లో ఏకపక్షంగా ఫలితాలు
X

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Telangana Panchayat Elections) అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు పైచేయి సాధించారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ ఊహించని విధంగా గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 67స్థానాలకు గాను 52స్థానాలను ఏకపక్షంగా దక్కించుకున్నారు. మహబూబ్ నగర్ మండలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ 12 చొప్పున స్థానాలను గెలుచుకోవడంతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరిగింది. జడ్చర్లలోని రాజాపూర్ మండలంలో అధికార పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ బీఆర్‌ఎస్ 17స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ గట్టి పోటి ఇచ్చి పుంజుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ కాంగ్రెస్ పైచేయి సాధించినప్పటికీ, బీఆర్‌ఎస్ ఊహించని విధంగా అధికార పార్టీకి దీటుగా ఫలితాలను సాధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేయగా, బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నామమాత్రంగా ప్రచారాలు చేసినప్పటికీ ఊహించని ఫలితాలు వచ్చాయి.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో (కొడంగల్)...

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 67స్థానాలకు గాను ఏకంగా 52స్థానాలను దక్కించుకున్నారు. మిగతా స్థానాలలో ఇతరులు గెలుపొందారు.

మహబూబ్ నగర్ జిల్లాలో.. మహబూబ్ నగర్ జిల్లాలో (Mahabubnagar District) ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. మహబూబ్ నగర్ రూరల్ మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ 12స్థానాలను, బీఆర్‌ఎస్ పార్టీ 12స్థానాలను దక్కించుకుంది. మహమ్మదాబాద్ మండలంలో పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్ మండలంలోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఈ మండలంలో 15స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఒకటి సీపీఎం, మరొక స్థానాన్ని స్వతంత్రులు గెలుచుకున్నారు. గండీడ్ మండలంలో 27స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 15, బీఆర్‌ఎస్ 11, స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు.

జడ్చర్ల నియోజకవర్గంలో....

జడ్చర్ల నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఎన్నికలు జరగగా, నవాబుపేట, ఊరుకొండ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినప్పటికీ, ఎమ్మెల్యే సొంత మండలం రాజాపూర్‌లో అధికార పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఈ మండలంలో మొత్తం 24గ్రామ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ 17స్థానాలను దక్కించుకుంటే, కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఇతరులు మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఎమ్మెల్యే సొంత ఊరు రంగారెడ్డిగూడెంలో బీజేపీ అభ్యర్థి 31ఓట్ల తేడాతో అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నవాబుపేటలో 42 స్థానాలకు గాను కాంగ్రెస్ 22, బీఆర్‌ఎస్ 18, ఇతరులు మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఊరుకొండ మండలంలో మొత్తం 16 స్థానాలకు కాంగ్రెస్-11, బీఆర్‌ఎస్ 3, ఇతరులు 2 స్థానాలలో గెలుపొందారు.

వనపర్తి జిల్లాలో...

వనపర్తి జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ జరిగింది. ఎమ్మెల్యే మెగా రెడ్డి సొంత మండలం పెద్దమందడిలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా 15 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈ మండలంలో బీఆర్‌ఎస్‌కు 7, బీజేపీకి ఒక స్థానం దక్కింది. జిల్లా గణపురం మండలంలో మొత్తం 29 స్థానాలు ఉండగా బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. గోపాల్‌పేట మండలంలో 15 స్థానాలకు గాను బీఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ ఆరు, ఇతరులు రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఏదుల మండలంలో 11 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ 7స్థానాలు, బీఆర్‌ఎస్ 1, బీజేపీ ఒక స్థానములో విజయం సాధించగా మరో రెండు స్థానాలలో స్వతంత్రులు గెలుపొందారు. రేవల్లి మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఆరు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు 1, బీజేపీకి 1, స్వతంత్రులకు ఒక స్థానం దక్కింది.

నాగర్ కర్నూల్ జిల్లాలో...

నాగర్ కర్నూల్ జిల్లాలో తాడూరు మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్ 10, స్థానాలను దక్కించుకోగా సీపీఐ ఒకటి, ఇతరులు 3 స్థానాలలో గెలుపొందారు. తెలకపల్లి మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలు ఉండగా 18 స్థానాలను కాంగ్రెస్, ఏడు స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకోగా మూడు స్థానాలలో స్వతంత్రులు గెలుపొందారు. వెల్దండ మండలములో మొత్తం 32 గ్రామ పంచాయతీలకు గాను 23 స్థానాలను కాంగ్రెస్, 8 స్థానాలలో బీఆర్‌ఎస్ గెలుపొందగా, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. కల్వకుర్తి మండలములో మొత్తం 24 గ్రామ పంచాయతీలకు గాను 14 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఆరు స్థానాలను బీఆర్‌ఎస్, నాలుగు స్థానాలను బీజేపీ దక్కించుకుంది.

జోగులాంబ గద్వాల జిల్లాలో...

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికలు పార్టీలపరంగా కాకుండా వ్యక్తుల ప్రాధాన్యతతో జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 80శాతానికి పైగా స్థానాలను గెలుచుకోగా, 10 గ్రామ పంచాయతీలలో బీజేపీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. అక్కడక్కడ ఇతరులు గెలుపొందారు. కాగా, గట్టు మండలంలోని గంగమాన్ దొడ్డి గ్రామానికి చెందిన కావలి పద్మానర్సింహులు తమ సమీప ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.

Next Story