నగర పాలక సంస్థ 2026-2027 సంవత్సరపు బడ్జెట్ ఆమోదం

by Ratna Kumari |

నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026 - 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది.

నగర పాలక సంస్థ 2026-2027 సంవత్సరపు బడ్జెట్ ఆమోదం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026 - 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నిజామాబాద్ నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.

2026 - 2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 - 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా.. కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ. 9471.33 లక్షలు, 2025 - 2026 సవరణ అంచనా ఆదాయం రూ. 13717.11 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 23188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026 - 2027 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 14763.60 లక్షలుగా బడ్జెట్ లో పొందుపర్చారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ. 9937.00 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం రూ. 24700.60 లక్షలుగా బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ వివరాలను సమావేశంలో చదివి వినిపించగా, సభ్యులు ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా తమ తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు సమావేశంలో ప్రస్తావించగా.. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం అని, నిజామాబాద్ నగర అభివృద్దే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ సూచించారు. నిజామాబాద్ నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించినట్లు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు.

పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నిజామాబాద్ లో మాస్టర్ ప్లాన్ అమలు అనివార్యంగా మారిందన్నారు. ఇప్పటికే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకు ముసాయిదా ప్లాన్ లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే వాటిని చేపట్టేందుకు వీలుగా కార్పొరేటర్లతో కూడా భేటీ నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, వారికి జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆయా డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు వీలుగా నెల రోజుల లోపే మేయర్ అనుమతితో నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. కార్పోరేషన్ కు ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు వీలుగా ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా పరిష్కరిస్తూ అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. సానిటేషన్ పనులు పక్కాగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేసుకుని, సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించాలని కమిషనర్ కు సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా అమలు చేయాలని ఆదేశించారు.

Next Story