- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడిగినంత ఇస్తేనే అపాయింట్‌మెంట్.. మంత్రుల పేషీల్లో మామూళ్ల పర్వం!
తెలంగాణ మంత్రుల పేషీల్లో పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీలు అక్రమాలకు పాల్పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కొందరు మంత్రుల కంటే వారి పేషీల్లో పనిచేస్తున్న సిబ్బంది (పీఏ, పీఎస్, ఓఎస్డీ) అధిక పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిపార్ట్‌మెంట్‌లో ఫైల్ క్లియరెన్స్‌లో వారి జోక్యం నడుస్తోందని ఫిర్యాదులు ఉన్నాయి. పేషీల్లోకి ఫైల్ ఎప్పుడు రావాలి? మంత్రి వద్దకు ఎప్పుడు వెళ్లాలి? ఆయన సంతకం ఎప్పుడు పెట్టాలి? మళ్లీ సెక్షన్‌కు ఎప్పుడు వెళ్లాలి? అనే అంశాలను పీఏ, పీఎస్‌లే దిశానిర్దేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ తతంగం వెనక డబ్బుల వ్యవహారం నడుస్తోందని, అడిగినంత ముట్టచెప్పకపోతే ఫైల్ అటుకెక్కుతుందని విమర్శలు ఉన్నాయి. వీరి తీరు వలన మంత్రులకు చెడ్డు పేరు వస్తున్నదని పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.
మెజార్టీ మంత్రుల వద్ద ఇదే పరిస్థితి..
మంత్రులకు ఉండే పని ఒత్తిళ్ల కారణంగా అన్ని విషయాలను స్వయంగా చూసుకోవడం సాధ్యం కాదు. అందుకోసం కోసం పేషీ స్టాఫ్ (పీఏ, పీఎస్, ఓఎస్డీ)ను నియమించుకుంటారు. శాఖల్లో కావాల్సిన సమాచారాన్ని అందించడం, క్లిష్టమైన ఫైల్స్ ఉంటే వాటి పుట్టుపుర్వోత్తరాలను కనుక్కుని మంత్రులకు పీఎస్, ఓఎస్డీలు వివరిస్తుంటారు. వీరద్దరు శాఖ పరమైన యాక్టివిటీస్‌ను ఫాలో అప్ చేస్తుంటారు. నియోజకవర్గంలోని పనుల కోసం, అక్కడ జరిగే రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని మంత్రికి అలర్ట్ చేయడం, అలాగే నాయకులు, కార్యకర్తల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు పీఏలు పనిచేస్తుంటారు.ఈ మూడు కేటగిరిల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు మంత్రులకు ఏ మేరకు మద్దతుగా ఉంటున్నారో తెలియదు. కానీ, సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శలు పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా అందినకాడికి దోచుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. పనికోసం వచ్చిన వారు ఇచ్చింది తీసుకుంటే పర్లేదు. కానీ డిమాండ్ చేసి మరీ తీసుకోవడంపైనే విమర్శలొస్తున్నాయి.
ప్రతి ఫైల్‌కు ఓ రేటు..
పలువురు మంత్రుల వద్ద పనిచేస్తున్న పీఎస్, ఓఎస్డీలు ఫైల్ క్లియరెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్ స్థాయిని బట్టి డబ్బులు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని నేరుగా మంత్రి వద్దకు వెళ్లినా సెక్షన్‌లోని అధికారులకు ఫోన్ చేసి ఫైల్ మీద కొర్రీలు పెడుతున్నట్టు టాక్. అందుకని మెజార్టీ వ్యక్తులు ఫైల్ సంబంధిత శాఖ మంత్రి వద్దకు వెళ్లే ముందు పీఎస్, ఓఎస్డీలను ముందుగా కలిసి వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ఫైల్ ముగింపు దశలో ఉన్న సమయంలో కొర్రి పడితే అసలకే ఎసరు వస్తుందనే భయంతో ఎంతో కొంత ఇచ్చేందుకు బేరాలు కుదుర్చుకోవడం, మెజార్టీ మంత్రుల పేషీల్లో రోటిన్‌గా మారినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
నేను చెబితేనే ఫైల్ క్లియర్
కొందరు పీఏలు, పీఎస్‌లు పరస్పర సహకారంతో మంత్రి వద్దకు వచ్చే ఫైల్‌ను స్డడీ చేసి సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తుంటారు.‘మీ ఫైల్ మంత్రి వద్దకు వచ్చింది. ఆయన సంతకం పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది’ అని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సంబంధిత వ్యక్తులు పీఏ, పీఎస్‌లను కలిసి డబ్బులు సమర్పించుకోవడం రోటిన్‌గా మారింది.
నియోజకవర్గాల్లో దందాలు..
కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న పీఏలు నియోజకవర్గం నుంచి వివిధ పనుల కోసం వచ్చే కార్యకర్తల సాధకబాధకాలను వినాలి. వాటి పరిష్కారం కోసం నేరుగా జిల్లా అధికారులతో మాట్లాడటమో.. లేకపోతే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పైస్థాయి అధికారులతో మాట్లాడించడమో చేస్తుంటారు. దీంతో జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, రాష్ట్ర స్థాయిలోని కొందరు అధికారులతో పీఏలకు నేరుగా పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని కొందరు పీఏలు నియోజకవర్గంలోని భూ దందాలు, సెటిల్‌మెంట్స్‌లో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. మంత్రి ఆదేశాల మేరకే పీఏలు ఫోన్ చేశారనే నమ్మకంతో జిల్లా అధికారులు సదరు పీఏలు అడిగిన మేరకు సాయం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
అడిగినంత ఇస్తేనే అపాయింట్‌మెంట్..
ఓ కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న పీఎస్.. ఆయన అధికారిక అపాయింట్‌మెంట్స్, టూర్ ప్రొగ్రామ్స్‌ను పర్యవేక్షిస్తుంటారు. పనుల కోసం మంత్రి వద్దకు తరచుగా బిజినెస్, పారిశ్రామిక వేత్తలు అపాయింట్‌మెంట్ అడుగుతుంటారు. కానీ సదరు పీఎస్ మంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు ఓ రేటు ఫిక్స్ చేశారని, ఆ మేరకు మామూళ్లను ముట్టచెబితేనే పని అవుతుందని, లేకపోతే అదిగోఇదిగో అంటూ కాలయాపన చేస్తుంటారని ప్రచారం ఉంది. ఇక అదే పేషీలో పనిచేస్తోన్న ఓఎస్డీ సైతం ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో చేతులు తడపనిదే మంత్రి ముందు పెట్టరని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి కంటే ఎక్కువ బూతు పురాణం
ఓ మంత్రి వద్ద పనిచేస్తోన్న పీఏ నుంచి ఫోన్ వస్తే చాలు. ఆ శాఖలోని అధికారులు హడలిపోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే మంత్రి పేరు చెప్పి సదరు పీఏ ఆఫీసర్లను బూతులు తిడుతున్నట్టు టాక్ ఉంది. మంత్రి తిడితే పర్లేదు. కానీ ఆయన పీఏ అంత కంటే ఎక్కువ బూతులు తిట్టడంపై ఆవేదన చెందుతున్నారు. దీంతో సదరు పీఏపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. మంత్రి మూవ్‌మెంట్‌ను తెలుసుకుని ఆయన్ను కలిసేందుకు పీఏకు ఫోన్ చేసినా ఆయన స్సందించడం లేదని మండిపడుతున్నారు.
అడిగినంత ఇస్తేనే పోస్టింగ్..
ఈ మధ్య బ్యూరోక్రాట్ హోదాలో ఓ మంత్రి పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి ఆ శాఖ పరిధిలో జరిగిన ప్రమోషన్ల విషయంలో జోక్యం చేసుకున్నారు. ప్రమోషన్లను ఫైనల్ చేసి పోస్టింగ్ లిస్టును రెడీ చేసి మంత్రి ఆమోదం కోసం పంపారు. కానీ ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో నిఘావర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఫైనల్ చేస్తానని సదరు బ్యూరోక్రట్ పెండింగ్‌లో పెట్టారు. అడిగినంత ఇవ్వనందుకే ఈ విధంగా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది.
సెల్‌ఫొన్స్ వివాదానికి పేషీ కారణమా?
ఈ మధ్య ఓ శాఖలో కొనుగోలు చేసిన ఫోన్లపై పెద్దఎత్తున రాజకీయ దుమారం రేగింది. టెండర్ల ప్రక్రియ అంత సజావుగా జరిగింది. కానీ విపక్షాలకు కావాల్సిన సమాచారం మాత్రం మంత్రి పేషీ నుంచి వెళ్లినట్టు నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
– ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఓ జిల్లాకు చెందిన మంత్రి పీఏ ఆ చుట్టుపక్కల జరిగే భూ దందాలో జోక్యం చేసుకుంటారని విమర్శలున్నాయి.
– ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన మంత్రి టైమ్ అంటే టైమ్ ఫాలో అవుతారు. కానీ ఆ పేషీ స్టాఫ్ మాత్రం ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఇబ్బంది పెడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి.
– ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ముందు ‘నేను ఐఏఎస్‌ను’ అంటూ పరిచయం చేసుకుంటారని విమర్శలు ఉన్నాయి.
– ఓ మంత్రి పేషీలో పలు ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉన్న పీఎస్ కంటే నాలుగైదు ఏండ్ల అనుభవం ఉన్న పీఏ పవర్ ఫుల్. కొన్ని కీలక ఫైల్స్ క్లియర్ చేసే ముందు పీఏతో డిస్కస్ చేయాలంటూ సదరు మినిస్టర్ పీఎస్‌కు చెప్పడం పరిపాటిగా మారిందని ప్రచారం జరుగుతోంది.
– పదవి చేపట్టి దాదాపు ఏడాది అవుతోన్న ఓ మంత్రి వద్ద పనిచేస్తోన్న పీఎస్‌పై పలు విమర్శలు ఉన్నాయి. ఏ విషయాన్ని తొందరగా తేల్చరని, ప్రతిదీ సాగదీస్తుంటారని, చివరికి తనకు తెలియదని చెప్పడం రోటిన్ అని ఆరోపణలు ఉన్నాయి.
– దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి వద్ద పనిచేస్తున్న ఓఎస్డీ.. డబ్బులు ఇవ్వకంటే ఆశాఖలోని ఫైల్స్ క్లియర్ చేయరని టాక్.






