తెలంగాణ అసెంబ్లీకి కొత్త విప్‌ల నియామకం.. అధికారిక ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-19 13:45:39  IST  )

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ అసెంబ్లీకి కొత్త విప్‌ల నియామకం.. అధికారిక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు, సభా వ్యవహారాలను సమన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. విప్‌లుగా నియమితులైన వారిలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, మహబూబ్ నగర్‌ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.

సభా నిర్వహణలో విప్‌లదే కీలక పాత్ర..

శాసనసభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు లేదా ముఖ్యమైన చర్చలు జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యేలా చూడటంలో విప్‌ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయకుండా పార్టీ లైన్‌ను అమలు చేయడం వారి ప్రధాన బాధ్యత. బడ్జెట్ సమావేశాలు, ఇతర కీలక సెషన్ల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజకీయంగా అనుభవం ఉన్న నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా సభలో ప్రభుత్వ పట్టును మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా నియామకాలపై సదరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి, పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Next Story