- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే జీపీఓలకు నియామక పత్రాలు
రాష్ట్రంలో అతి త్వరలోనే గ్రామ పరిపాలన అధికారులు (జీపీఓ)కు నియామక పత్రాలను అందజేసి విధుల్లోకి తీసుకోనున్నారని రెవెన్యూ జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అతి త్వరలోనే గ్రామ పరిపాలన అధికారులు (జీపీఓ)కు నియామక పత్రాలను అందజేసి విధుల్లోకి తీసుకోనున్నారని రెవెన్యూ జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి అన్నారు. ఇప్పటికే జీపీఓ నియామకం కోసం పరీక్ష రాసి అర్హత సాధించిన 3,454 మందికి మొదటి విడతలో ఈ అవకాశం దక్కుతుందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ లోకేష్ కుమార్ గురువారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ దృష్టికి పలు విషయాలను లచ్చిరెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామాలలో అదే సంఖ్యలో జీపీఓల నియామకం చేయాలన్నారు. కానీ ప్రస్తుతం 3,454 మంది మాత్రమే ఎంపిక అయ్యారని గుర్తు చేశారు. ఇదే కాకుండా ఆసక్తి కలిగిన పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలకు మరో సారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
61 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు సైతం జీపీఓలుగా అవకాశం కల్పించాలని కోరారు. ఇంకా మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేలా చూడాలన్నారు. అలాగే వీఆర్ఏలను ఇతర డిపార్ట్ మెంట్ లలో సర్దుబాటు చేసే సమయం కంటే మృతి చెందిన వారి కుటుంబాలలో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపిన పూర్వ వీఆర్ఏలను సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. అన్ని అంశాలపై సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఎంపికైన జీపీఓల, ఇతర విషయాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించి అతి త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పని ఒత్తిడిని బట్టి కార్యాలయాలలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లతో కూడా భూ భారతి సదస్సుల దరఖాస్తులు ఎంక్వైరీ చేయించడానికి జిల్లా కలెక్టర్ లకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మల్లేష్ , రాంబాబు, చైతన్య పాల్గొన్నారు.






