ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. సులోచన ఫామ్‌హౌస్‌లో రూ.11కోట్లు సీజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-30 02:34:38  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case) కీలక మలుపు తిరిగింది.

ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. సులోచన ఫామ్‌హౌస్‌లో రూ.11కోట్లు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case) కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ (AP SIT) అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సులోచన ఫామ్‌హౌస్‌ (Sulochana Farm House)లో నిర్వహించిన సోదాల్లో రూ.11 కోట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. మొత్తం 12 బాక్సుల్లో నగదును దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏ1 నిందితుడైన రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy) ఆదేశాల మేరకు తాను ఆ డబ్బును దాచి ఉంచినట్లు వరుణ్ తెలిపాడని సిట్ అధికారులు పేర్కొన్నారు. వరుణ్, చాణక్య కలిసి ఆ నగదును దాచినట్లు అంగీకరించారని తెలిపారు.

రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఇచ్చిన ఆదేశాల మేరకు 2024 జూన్ లో వినయ్ సహాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో సులోచన ఫామ్ హౌస్ లో దాచినట్లు సిట్ విచారణలో తెలిపాడు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ లో సుమారు రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. గత వైసీపీ హయాంలో ఈ స్కామ్ జరగ్గా.. ఇప్పటికే పలువురు కీలక నిందితులు, వైసీపీకి చెందిన నేతలను అరెస్ట్ చేశారు.

Next Story