- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అక్రమంగా బనకచర్లను నిర్మిస్తున్నది : అఖిలపక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టం ఉల్లంఘనకు పాల్పడుతూ బనకచర్లను నిర్మిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టం ఉల్లంఘనకు పాల్పడుతూ బనకచర్లను నిర్మిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం సెక్రటేరియట్‌లో బనకచర్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర నిబంధనలు ఉల్లంఘించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు.
రూ.81,900 కోట్లతో పోలవరం రిజర్వాయర్ నుండి కృష్ణా నది మీదుగా వరద నీటిని పెన్నాకు తరలించే రీతిలో మూడు భాగాలు చేసి 417 కిలోమీటర్ల దూరానికి కాలువలు, పైప్‌లు సొరంగాలతోపాటు తొమ్మిది విద్యుత్ ఆధారిత ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారని వెల్లడించారు. తద్వారా ప్రస్తుతం ఉన్న 22.59 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 7.41 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్‌ను మార్చడమే కాకుండా గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా విస్మరిస్తుందని ఆరోపించారు. పైగా గోదావరి జలాశయాలలో 968 టీఎంసీల నీటి వాటాను కాదని.. అదనపు వరద నీటిని తరలించుకునే ఎత్తుగడలో భాగమే ఏపీ ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిందన్నారు.
తెలంగాణకు ముంపు ప్రమాదం..
అక్కడి ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ పైభాగం ముంపునకు గురవుతుందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం రామాలయంతోపాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం నుండి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని చెప్పారు. గోదావరి నీటి సమస్యల ట్రిబ్యునల్ తుది ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సూచనల మేరకే షెడ్యూల్‌లో మార్పులు చేయాలన్న నిబంధనలను ఆయన వెల్లడించారు.
అనుమతులు లేకుండానే నిర్మాణం..
పర్యావరణ అనుమతులతోపాటు టీఓఆర్ అనుమతులు లేవని, 2018లో కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం పోలవరం వద్ద అదనపు నీరు లేదని తేల్చిచెప్పినా వరద నీటితో ప్రాజెక్టును నిర్మిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని మోసం చేస్తున్నదంటూ మంత్రి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నా ఏపీ జలహారతి కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకుని టెండర్లు వేయడం, వేగవంతంగా నిధులను సమీకరించి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు.
కేంద్ర మంత్రులను కలుస్తున్నాం..
గోదావరి-బనకచర్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలకు మించి రైతాంగం ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. బనకచర్లపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించడంతోపాటు అడ్డుకునేందుకు గురువారం కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్‌తో తాను, సీఎం భేటీ కానున్నట్లు వెల్లడించారు. అయితే రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాంత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సంఘటితంగా బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (బీఆర్ఎస్), రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘురాం రెడ్డి(కాంగ్రెస్)తోపాటు బీజేపీకి చెందిన ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
కేంద్ర మంత్రులు గైర్హాజరు
బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం నిర్వహించగా.. బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు గైర్హాజరయ్యారు. మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇద్దరు కూడా వేర్వేరు షెడ్యూల్ ఉండడంతో సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని సమాచారం ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా.. బీజేపీ నుంచి మరో ఆరుగురు ఎంపీలు ఉన్నప్పటికీ ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. అలాగే.. బీఆర్ఎస్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ.. ఒక్కరు మాత్రమే అటెండ్ కావడం గమనార్హం. సమావేశం మధ్యలోనే బీఆర్ఎస్ సభ్యుడు రవిచంద్ర వాకౌట్ చేశారు.






