ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

by Malleboina Mahesh |

పవన్ కళ్యాణ్ "తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయి" అంటూ చేసిన వ్యాఖ్యలను అనిరుధ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మొంథా తుఫాను కారణంగా ద్వంసమైన కోనసీమ జిల్లాలోని (Konaseema District) కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమకు ఇలా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ "తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయి" అంటూ చేసిన వ్యాఖ్యలను అనిరుధ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. "మా దిష్టి తగిలితే అసలు పవన్ కళ్యాణ్ గెలిచేవాడా?" అని ఆయన ప్రశ్నించారు. అలాగే "మేము వాళ్లు బాగుండకూడదు అని నిజంగానే అనుకుంటే, హైదరాబాద్‌లో వాళ్లు ఉండగలుగుతారా?" అని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, ఇక్కడి వనరులను వాడుకుంటూ, ఇక్కడే సినిమాలు విడుదల చేస్తూ, తెలంగాణ ప్రజలపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

"వాళ్లలాగా మేము ఒకరి కాళ్లు పట్టుకోలేం, లంచాలు ఇచ్చి పని చేసుకోలేం" అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ పార్టీ తీరును పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ఒకసారి ఆలోచించుకోవాలని.. తప్పు చేసిన వారిని తాను పక్కాగా టార్గెట్ చేస్తానని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రకమైన వ్యాఖ్యలు సరికాదని, ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలను పెంచేలా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story