HYD: భట్టి విక్రమార్క ఇంట్లో ఏపీ CM చంద్రబాబు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసానికి విచ్చేశారు.

HYD: భట్టి విక్రమార్క ఇంట్లో ఏపీ CM చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసానికి విచ్చేశారు. ఇటీవల వివాహం చేసుకున్న భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షిలను ఆశీర్వదించేందుకు ఆయన మర్యాదపూర్వకంగా భట్టి నివాసానికి వెళ్లారు. ముందుగా నాయుడుకు డిప్యూటీ సీఎం స్వయంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులను కలిసిన చంద్రబాబు, వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత బాంధవ్యాలను గౌరవిస్తూ సాగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భట్టి విక్రమార్క తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా గతంలోనే అమరావతికి వెళ్లి చంద్రబాబు నాయుడును స్వయంగా ఆహ్వానించారు. అయితే, అప్పట్లో ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వివాహానికి హాజరుకాలేకపోయిన చంద్రబాబు, ఇప్పుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి నూతన దంపతులను కలిసి అభినందనలు తెలిపారు. మార్చి 5న శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించిన సంగతి తెలిసిందే.

Next Story