- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభయ్ స్టేట్‌మెంట్‌తో మాకు సంబంధం లేదు.. మావోయిస్టు జగన్ పేరిట మరో సంచలన ప్రకటన
ఆయుధాలను విడిచిపెట్టాలని మావోయిస్టు పార్టీ(Maoist Party) నిర్ణయం తీసుకున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఆయుధాలను విడిచిపెట్టాలని మావోయిస్టు పార్టీ(Maoist Party) నిర్ణయం తీసుకున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్(Maoists Abhay) పేరిట లేఖలు విడుదల అయ్యాయి. తాజాగా అభయ్ పేరుతో విడుదలైన లేఖలపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ(Maoist Telangana State Committee) స్పందించింది. అది కేవలం సోనూ(Maoist Sonu) నిర్ణయం మాత్రమే అని.. పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికార ప్రతినిధి జగన్(Maoist Jagan) పేరిట మరో లేఖ విడుదలైంది.
జగన్ లేఖలో ఏముందంటే?:
‘‘ప్రియమైన ప్రజలారా.. కేంద్రంలోని బీజేపీ పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, కేడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది. ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ- కూంబింగులు, హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది.
అయినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా.. యుద్ధ చర్యలను కొనసాగిస్తూ రక్తపు టేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోంమంత్రి సైతం బాహాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తానని పదే పదే ప్రకటిస్తున్నారు. మరొక వైపున తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో ప్రజా సంఘాలు, ప్రజలు ఆపరేషన్ కగార్ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని ఆందోళన చేశారు. దేశ వ్యాప్తంగా కూడా ఎంతో మంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధ కాండను ఆపాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీమ్ మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెమ్ బాలకృష్ణ, పర్వేశ్ సోరెన్ (జార్ఖండ్)లు అమరులు అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతం, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితోల్లో కొంత మంది రాష్ట్ర కమిటీ సభులు, కింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.
దేశ వ్యాప్తంగా కగార్‌ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని కామ్రేడ్ సోనూ అడగటం అనాలోచిత చర్య. అంతేగాకుండా వ్యక్తిగతంగా కాల్పుల విరమణ ప్రకటించడం కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావటం లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలసి లీగల్‌గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్‌లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయక పోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుంది. తాను అనుసరించిన పద్దతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది.
ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను బహిరంగంగా చర్చ పెట్టి పరిష్కరించాలని అనుకోరు. అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్లు ఇలా చేయరు. నేడు పార్టీలో పైస్థాయి నుండి కింది వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరూ అనుకోవటం లేదు. ఈ సమస్యకు ఇప్పటికి ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు. 2024లో పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్‌ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. పాలస్తీనా విషయంలో నేడు మారణకాండ ఏ విధంగా జరుగుతున్నదో ప్రపంచ వ్యాప్తంగా అర్థం అవుతుంది. ఇంటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి’’ అని అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది.






