రాష్ట్రంలో మరో స్కీమ్ ప్రారంభం.. చిన్నారులకు ‘తొలి ముద్ద’ షురూ

by Prasad Jukanti |

తెలంగాణ అంగన్‌వాడీ చిన్నారుల కోసం 'తొలి ముద్ద' బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ.

రాష్ట్రంలో మరో స్కీమ్ ప్రారంభం.. చిన్నారులకు ‘తొలి ముద్ద’ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని అంగన్‌వాడీ చిన్నారులకు కొత్త బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ‘తొలి ముద్ద’ (Tholi Mudda Scheme) ప్రారంభమైంది. ఇక నుంచి చిన్నారులకు రెడీ టూ కుక్‌ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ కొత్త పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది.. కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారం అందిస్తోందన్నారు. తాజాగా బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా ప్రారంభించామన్నారు. ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా.. అమలు చేయాల్సింది అంగన్‌వాడీ టీచర్లు మాత్రమేనని సూచించారు. అందుకే ఈ ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందన్నారు.

అంగన్‌వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు:

అంగన్‌వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌కు మొబైల్ ఫోన్లు సీఎం పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story