Y. S.Jagan Mohan Reddy: మరో కీలక నిర్ణయం.. కొత్త కార్యక్రమంతో ప్రజల ముందుకు

by Disha Web Desk 13 |
Y. S.Jagan Mohan Reddy: మరో కీలక నిర్ణయం.. కొత్త కార్యక్రమంతో ప్రజల ముందుకు
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 'జగనన్నకు చెబుదాం' అనే పేరుతో మరో కొత్త కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం విధి విధానాలపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు స్పందనకు మెరుగైన రూపం పై అధికారులతో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వినతులకు సంబంధించి సీఎంఓ, ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షించేలా ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం అని చెప్పుకొచ్చారు. వ్యక్తులకు సంబంధించిన సమస్యలతో పాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాం. ఒక నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచాం. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. స్పందన తో పాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టి పెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా..? అన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలి అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

స్పందన కన్నా మరింత మెరుగ్గా..

సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా మనం నిలవాలి. ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో మనం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేశాం. మనం అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అన్నదానిపై మనం దృష్టి సారించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించ దగ్గవి ఉంటే వాటిని కూడా స్వీకరించాలి అని సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.

పథకాలు కావొచ్చు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు. కానీ ఏ ఒక్కరూ కూడా అర్హులైన వారు మిగిలి పోకూడదు, అలాగే సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోవద్దు అన్నదే దీని ఉద్దేశం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి..? అన్నదానిపై ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి అని సూచించారు. సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన అధికార యంత్రాంగం వ్యవస్థకు ప్రజలు చేర్చిన ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే ఉద్దేశంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్పందన కార్యక్రమం కన్నా మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలన్నది ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. అధికారులంతా కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటి వరకూ అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మైక్రో స్థాయిలో కూడా పరిశీలన చేసి.. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. వినతుల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి అని సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Next Story

Most Viewed