మహానగర సిగలో మరో కలికితురాయి.. కాసేపట్లో GSEC‌ని ప్రారంభించనున్న సీఎం రేవంత్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ (Hyderabad) మహానగర సిగలో మరో కలికితురాయి చేరబోతోంది.

మహానగర సిగలో మరో కలికితురాయి.. కాసేపట్లో GSEC‌ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగర సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్ సిటీ రోడ్డులోని గూగుల్ దివ్యశ్రీ భవన్‌లో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ (Google) ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. అయితే, ఇండియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇదే కావడం విశేషం. ఏషియా పసిఫిక్ జోన్‌లో టోక్యో (Tokyo) తర్వాత గూగుల్ నెలకొల్పుతున్న రెండో సెంటర్.. ప్రపంచంలోనే ఇది ఐదవది కావడం సంతోషకరం. కాగా, గతేడాది ఆగస్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా (America) పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాయలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. నాడు హైదరాబాద్‌లో గూగుల్ సెఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. అందుకు ఆయన ప్రత్యక చొరవ కూడా తీసుకున్నారు.

జీఎస్ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలంటూ, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో నేడు GSEC నగరానికి వచ్చింది. పోయిన ఏడాది అక్టోబర్‌లో గూగుల్ ఫర్ ఇండియా-2024 కాన్‌క్లేవ్‌లో గూగుల్​సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్‌ (Royal Hansen) అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం 2024, డిసెంబర్ 4న గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) అనేది అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. అధునాతన భద్రతతో పాటు ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన, సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, పరిశోధకులకు చక్కని ప్లాట్‌ఫాంగా GSEC ఉపయోగపడనుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ఐటీ రంగంలో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Next Story