Hampi Tour: కవిత వైపు నుంచి మరో లీక్.. ఈసారి టార్గెట్ మాజీ మంత్రులతో పాటు సిట్టింగ్ ఎంపీ?

by Prasad Jukanti |   (  Updated:2025-09-10 03:57:57  IST  )

కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Hampi Tour: కవిత వైపు నుంచి మరో లీక్..  ఈసారి టార్గెట్ మాజీ మంత్రులతో పాటు సిట్టింగ్ ఎంపీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ లోని కీలక నేతల గురించి రోజుకో లీక్ ఇస్తున్న కవిత మద్దతు దారులు తాజాగా మరో సంచలన విషయంపై ఎక్స్ లో పోస్టు చేశారు. నిన్న సంతోష్ రావు అవినీతి ఆరోపణలు అంటూ లీక్స్ ఇవ్వగా ఇవాళ గతంలో బీఆర్ఎస్ నేతల హంపీ టూర్ పై కీలక విషయాలు వెల్లడించారు. కవితక్క అప్ డేట్స్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో ఈ పోస్టు చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హంపీ టూర్ ను ప్రస్తావిస్తూ హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హంపీలో కమలాన్ని మొలకెత్తించాలని అనుకున్న కారు ఓనర్లు’ పేరుతో సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా నేతల పేర్లు ప్రస్తావించకుండా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

కేటీఆర్ ను ఒప్పుకోం:

ఈ ట్వీట్ ప్రకారం.. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఇస్తున్న పార్టీ అని చెప్పి కొంత మంది గులాబీ నాయకులు హంహీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా వారు మాట్లాడుకున్నది వేరు అని ట్వీట్ లో పోస్టు చేశారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లం మేమే. కేసీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా? అని కొంత మంది నేతలు చెప్పారని ఈ సందర్భంగా పార్టీకీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారని రాసుకొచ్చారు. ఆ తర్వాత పార్టీలో జరిగిన కీలక విషయాలను పోస్టులో వివరించారు.

ట్వీట్ యథావిధిగా:

'కేసీఆర్ కి వెన్నుపోటు పొడవాలి అని, కార్ ఓనర్‌ను బలిచ్చిన మచ్చ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి, కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా, కేసీఆర్ తరువాత కేటీఆర్‌ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లమేము. కేటీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా? అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు. పార్టీకి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అగ్గిపెట్ట మచ్చ, పార్టీ ఓనర్ మరియు ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలి అని మొదట అనుకున్నా, అది సాధ్యమవుతుందో లేదో అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లాలని ఆ నాయకులు భావించారు. అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివితక్కువతనం. ఈ విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు కేసీఆర్ గారికి తెలిసినవి . అప్పుడు మెల్లగా మన మచ్చ, కేటీఆర్ దగ్గరకు వచ్చి ‘నేను మా వెంటనే ఉంటా, ఎక్కడికీ వెళ్లను. నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి. నేను ఏం చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడు’ అని చెప్పి, పాపం పార్టీ ఓనర్‌ను తన స్వార్థం కోసం బలిచేశాడు. ఇలాగే చెప్పితే నమ్ముతారో లేదో అని, తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు.తనకు మంత్రి పదవి ఇచ్చినా, కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎక్కడ ఎంతవరకు ఉంచాలో, అక్కడ వరకే ఉంచారు కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి వెళ్తున్నాడని వార్తలు రప్పించుకొని, బ్లాక్‌మెయిల్ చేసి పార్టీ లో నంబర్ 3 స్థానం దక్కించుకున్నాడు. కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ గారికంటే తానే గొప్ప అని, ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకుంటున్నాడు. ఈ సమావేశంలో నల్గొండకు చెందిన అప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు, చంటి, రసమలై, పార్టీ ఓనర్... తదితరులు ఉన్నారు. వాళ్ల పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాం'

Next Story