తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇకనుంచి మరింత స్పీడ్‌గా హైదరాబాద్‌ నుంచి గోవాకు ప్రయాణం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-15 01:49:01  IST  )

తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, హైదరాబాద్-పనాజీ కారిడార్‌లో భాగంగా 80 కి.మీ మేర 4 లేన్ల రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇకనుంచి మరింత స్పీడ్‌గా హైదరాబాద్‌ నుంచి గోవాకు ప్రయాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, హైదరాబాద్-పనాజీ కారిడార్‌లో భాగంగా 80 కి.మీ మేర 4 లేన్ల రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు మరింత సమయం ఆదా అవుతుంది. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రద్దీ మరింతగా పెరిగి... వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

ప్రాజెక్టు ముఖ్యాంశాలు:

ప్రాజెక్టు వివరాలు: ఎన్.హెచ్.167 పరిధిలోని మహబూబ్ నగర్-గుడెబల్లూరు సెక్షన్ 4 లేన్ రోడ్డు నిర్మాణం

మొత్తం దూరం: 80 కి.మీ

అంచనా వ్యయం: రూ. 3,175 కోట్లు.

నిర్మాణ కాలం: 2 ఏళ్లు.

ప్రధాన ప్రాంతాలు: మహబూబ్‌నగర్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, రాయచూర్ (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), హైదరాబాద్‌లకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.

సగం తగ్గనున్న ప్రయాణ సమయం..

తెలంగాణలోని కోదాడ నుంచి కర్ణాటకలో బళ్లారి సమీపంలో ఉండే హగరి వరకు ఉన్న ఎన్ హెచ్-167 పరిధిలోని మహబూబ్‌నగర్ నుంచి గుడెబెల్లూర్ చేరుకోవడానికి ప్రస్తుతం దాదాపు 3 గంటల సమయం పడుతోంది. ఈ కొత్త 4 లేన్ల రహదారి అందుబాటులోకి వస్తే ఆ సమయం 1.5 గంటలకు తగ్గిపోనుంది. అంటే ప్రయాణ కాలం ఏకంగా 50శాతం మేర తగ్గడం వల్ల ప్రయాణికులకు భారీ ఊరట లభించడమే కాకుండా, వాహనాల ఇంధన పొదుపు కూడా సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ రహదారిలో విజయవాడ, కోదాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్, మక్తల్, రాయచూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు మీదుగా హగరి (బళ్లారి) చేరుకుంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వాహనాలు హైదరాబాద్, జడ్చర్ల, మహబూబ్ నగర్, రాయచూరు, కొప్పల్, హుబ్బలి మీదుగా వెళ్తాయి. అయితే ప్రస్తుతం రాయచూరు-భాగల్ కోట్-బెలగావి-పనాజీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్-మహబూబ్ నగర్-గోవాకు సుమారు 700కి.మీ దూరం, 15 గంటలకు పైగా సమయం పడుతోంది. మహబూబ్ నగర్-గుడెబల్లూరు 4 లేన్ తో పాటు రాయచూరు- బెలగావి-పనాజీ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తయితే దాదాపు 200 కి.మీపైగా దూరం తగ్గుతుంది. కేవలం 5 గంటల్లో హైదరాబాద్ నుంచి గోవా చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఆర్థిక పురోగతికి ‘హైవే’ బాట

ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా పనిచేయనుంది. పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తుంది. హైదరాబాద్‌లోని ఫార్మా, మెడికల్ క్లస్టర్లు, ఎస్ఈజెడ్స్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (ఎన్ఐసీడీసీ)లను ఈ రహదారి అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ పరిధిలో రాయచూరు, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, 2 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తారు. నిర్మాణ దశలో సుమారు 14.4 లక్షల పనిదినాల మేర ఉపాధి లభించనుంది. స్థానికులకు ఇది ఎంతో లాభదాయకంగా మారుతుంది. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో ఈ రహదారి కీలక పాత్ర పోషించనుంది. అటు రాయచూర్ వంటి ఆకాంక్షిత జిల్లాకు, ఇటు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు మధ్య వారధిగా నిలిచి, ఈ ప్రాంత వాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చనుంది.

Next Story