- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ‘ఉల్లాస్’కు శ్రీకారం
వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన, మధ్యలోనే చదువును మానేసిన వారికి విద్యను బోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన, మధ్యలోనే చదువును మానేసిన వారికి విద్యను బోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్ఈపీ-2020కి అనుగుణంగా.. పదిహేనేళ్లు పైబడిన వారికి విద్యనందించడానికి అండర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) స్కీమ్ ను అమలు చేస్తున్నది. 2022-2027 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఏడాదికి కోటి మంది అభ్యాసకులతో ఐదు కోట్ల మంది అక్షరాస్యులను నమోదు చేయాలని భావిస్తున్నది. ప్రాథమిక విద్య, జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలను అందించేలా ప్రణాళికలురూపొందించింది. దీంతోపాటు అవగాహనతో చదవడం, రాయడం, అంకెలను గుర్తించడానికి ప్రత్యేక పుస్తకాలను రూపొందించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయనున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలోనూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్), పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) సహకారంతో ‘ఉల్లాస్’ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
‘టాస్’ ఆధ్వర్యంలో..
రాష్ట్రంలో ఎంతో మంది పదో తరగతి, ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాక చదువు గురించి పట్టించుకోవడం లేదు. ఇలాంటివారిని గుర్తించి ఉల్లాస్ స్కీమ్ లో భాగంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతికి పద్నాలుగేళ్లు, ఇంటర్మీడియట్ కు పదిహేనేళ్లు పైబడిన వారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి ఫీజు చెల్లిస్తే ఐదేండ్ల వరకు పరీక్షలు రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాగా, సంవత్పరానికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నారు.
మెప్మా ఆధ్వర్యంలో సర్వే..
పదిహేనేళ్లు పైబడిన నిరక్షరాస్యులు, ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదవాలనే ఆసక్తిగా ఉన్నవారిని గుర్తించేందుకు మెప్మా ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేలో గుర్తించిన ప్రతి ఒక్కరికీ చదువు నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉల్లాస్ పథకంలో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు, అణగారిన వర్గాలు, సంచార జాతులు, కార్మికులకు విద్యనందించాలని డిసిషన్ తీసుకున్నారు. నీతి ఆయోగ్ గుర్తించిన జాతీయ/రాష్ట్ర సగటు కంటే తక్కువ అక్షరాస్యత రేటు ఉన్న జిల్లాలతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యులకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా సంఘాల సభ్యులకు..
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యుల్లో చాలా మందికి మందికి కనీసం సంతకం కూడా పెట్టరాని పరిస్థితి ఉన్నది. ఫలితంగా బుక్ కీపింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఉల్లాస్ పథకంలో భాగంగా మహిళా సంఘాల్లోని సభ్యులకు సైతం చదువు నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 158 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 1.74 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 17.65లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో చదువు రాని, చదవాలనే ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ఉల్లాస్ లో భాగంగా విద్యనందించేందుకు సిద్ధమవుతున్నారు.
వాలంటీర్లకు ప్రోత్సాహకాలు
ఉపాధ్యాయ విద్య, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ వాలంటీర్లకు ఉల్లాస్ లో వాలంటీర్లుగా అవకాశం ఇవ్వనున్నారు. అయితే వీరికి ముందుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. వాలంటీర్లుగా పని చేసిన వారికి సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలు, సత్కారాలు మొదలైన వాటి ద్వారా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో వాలంటీర్లుగా చురుగ్గా పాల్గొనే విద్యార్థులకు క్రెడిట్‌లను కేటాయించాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీసీ తమ అనుబంధ సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.






