బీఆర్ఎస్‍కు మరో BIG షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 10:33:43  IST  )

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రితో మంతనాలు జరపడం హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్‍కు మరో BIG షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‍కు మరో బిగ్ షాక్ తగలబోతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కారి దిగి కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇదే జరిగితే జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరికతో జోరుమీదున్న గులాబీ పార్టీకీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఎగ్జిట్ రూపంలో గట్టి ఎదురుదెబ్బగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది.

కేంద్ర మంత్రితో మంతనాలు!

తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యక్షం కావడం ఈ చర్చకు దారి తీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉప్పు నిప్పులా రాజకీయం సాగుతున్న తరుణంలో జీవన్ రెడ్డి బీజేపీ కేంద్ర మంత్రితో రహస్య మంతనాలేంటి? అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీలో చేరేందుకే ఆయన ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారా? లేక ఏదైనా ఇతర కారణాలతో కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లారా అనేది సస్పెన్స్ గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జీవన్ రెడ్డి రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారని ముఖ్యంగా ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి మాల్‌కు అధికారులు తాళాలు వేసినప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు సైతం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోది. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్‍‍కు గుడ్ బై చెప్పి బీజేపీ టీమ్ లో చేరబోతన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్, బీజేపీలో జోరుగా చర్చ:

ప్రహ్లాద్ జోషి నివాసంలో జీవన్ రెడ్డి ప్రత్యక్షం కావడంతో ఈ పరిణామం ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలో ఆసక్తిగా మారింది. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల తన ప్రెస్ మీట్‍లో చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి విషయంలోనూ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోందా? జరుగుతున్న ప్రచారమే నిజం అయితే జీవన్ రెడ్డి చేరికను ఎంపీ ధర్మపురి అరవింద్ వర్గం అంగీకరిస్తుందా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో వినిపిస్తోంది. మొత్తంగా కేంద్ర మంత్రితో జీవన్ రెడ్డి భేటీ ఇరు పార్టీలో హాట్ డిస్కషన్‍కు దారి తీసింది.

Next Story