మరి ఇవి కూడా పాకిస్థాన్ వేడుకలేనా?.. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్

by Ramesh Goud |

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపితే పాకిస్థాన్ వేడుకలతో పోల్చడం కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.

మరి ఇవి కూడా పాకిస్థాన్ వేడుకలేనా?..  బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపితే పాకిస్థాన్ వేడుకలతో పోల్చడం కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ వేడుకల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన రేవంత్ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థం అవుతుందని, ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి, నోటి నుండి ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడు నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

ఒక్క రోజు ముందుగా జరపడం కాదు, ఏడాది పొడుగునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను మా ప్రభుత్వం నిర్వహించే ప్రణాళిక చేశామని తెలిపారు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగిశాయని గుర్తుచేశారు.

స్వతంత్ర పోరాటాన్ని చూడని నవతరం, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చూడటమే గాక ప్రత్యక్షంగా పాల్గొందని, ఆ ఆర్తి ఉంది కాబట్టే, 2023లో బీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిన్న గన్ పార్కు వద్ద నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని మరోసారి విజయవంతం చేశారని స్పష్టం చేశారు. ఇవన్నీ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వారికి ఎలా అర్థం అవుతాయని, అందుకే వారికి కేసీఆర్ గారి నిన్నటి క్యాండిల్ లైట్ ర్యాలీ, సంబరాలు పాకిస్తాన్ అవతరణలా అనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా భూపేష్ భాగెల్ ఉన్నపుడు ఆయన కూడా 3 రోజుల రాష్ట్ర అవతరణ ఉత్సవం జరిపారు. అంటే, భూపేష్ భాగెల్ 3 రోజుల సంబరాలు కూడా పాకిస్థాన్ లో ఒక రోజు ముందు స్వతంత్ర దినోత్సవం జరపడం అన్నట్లే నా అని హరీష్ రావు దుయ్యబట్టారు.

Next Story