Delhi liquor scam: స్కాంలో మరో కీలక పరిణామం!

by GSrikanth |   (  Updated:2022-12-19 12:38:34  IST  )

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు

Delhi liquor scam: స్కాంలో మరో కీలక పరిణామం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో త్వరలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇప్పటికే సీబీఐ విచారించగా తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ ను ఈ నెల 11వ తేదీన సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఆ రోజు సుమారు 7 గంటల పాటు వివిధ అంశాలపై కవిత వివరణ తీసుకుంది. ఈ స్కామ్ లో నిందితులైన సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల వివరాలతో కవితను సీబీఐ ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే తొలిసారి స్టేట్ మెంట్ రికార్డు చేసిన సీబీఐ ఆ తర్వాత సీఆర్పీసీ 91 కింద సీబీఐ మరోసారి నోటీసులు జారి చేసిన సంగతి తెలిసిందే.

ఈ నోటీసుల కింద మొదటి దఫా కంటే మరింత లోతుగా విచారించే అవకాశాలు ఉంటాయి. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఈడీ కవితను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. అదే జరిగితే సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కవిత ఇక ఈడీ ఎదుట వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అమిత్ అరోరా కస్టడీ రిపోర్ట్ లు కవిత పేరును ఈడీ వెల్లడించింది. అనంతరం సీబీఐ కవిత నుంచి స్టేట్ మెంట్ తీసుకోగా ఇక ఈడీ వంతు వచ్చిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు బెదిరించాలని చూస్తున్నారని కవిత ఇప్పటికే ఆరోపించిన నేపథ్యంలో ఈడీ విచారణ ఉంటుందా? ఉంటే ఎప్పుడు? ఏయే అంశాలపై విచారిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

Next Story