రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. హరీష్‌రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 09:38:31  IST  )

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు వయోభారంతో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. హరీష్‌రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు వయోభారంతో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు, పార్టీల ముఖ్య నేతలు, అభిమానులు హరీశ్‌రావు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఆయన తండ్రి మరణం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ పర్యటనలో జాగృతి జనం బాట కార్యక్రమంలో ఉన్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇవాళ కోకాపేట్‌ (Kokapet)లోని హరీశ్‌రావు నివాసానికి భర్త అనిల్‌తో కలిసి వెళ్లారు. ముందుగా సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్‌రావుతో మాట్లాడి, ఆయన కుటుంబ సభ్యులు, మేనత్త లక్ష్మిని ఓదార్చారు. ఇక ఆమె నేరుగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి వెళ్లిపోయారు.

కాగా, ఇటీవలే కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం అవినీతిలో తన తండ్రి కేసీఆర్ పాత్ర లేదని అంతా హరీశ్‌రావే ముందుడి నడిపించాడంటూ ఫైర్ అయ్యారు. కోవర్టుల కారణంగా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందని ఆయనను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌ హరీశ్‌రావు, సంతోష్‌రావులేనని మీడియా ఎదుట స్టేట్‌మెంట్ ఇవ్వడం అప్పట్లో తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తాజాగా హరీశ్ తండ్రి కన్నుమూసిన నేపథ్యంలో కవిత నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. నిన్న, మొన్నటి వరకు అసలు ఇద్దరి మధ్య ఇక మాటలుండవని అనుకున్న రాజకీయ విశ్లేషకులు తాజా పరిణామంతో పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే మరోసారి రుజువైందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇద్దరి మధ్య పంచాయితీ సమసినట్లేనా అని చర్చించుకుంటున్నారు.

READ MORE ....

గోదావరి జలాల ఎత్తిపోతలపై మౌనమెందుకు.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్న

Next Story