మంత్రులతో అత్యవసర జూమ్ మీటింగ్.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సీఎం ఆరా

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-09 02:37:07  IST  )

తెలంగాణ (Telangana)లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నాటి నుండి కొనసాగుతున్న హోరాహోరీ ప్రచార పర్వం నేటితో ముగియనుంది.

మంత్రులతో అత్యవసర జూమ్ మీటింగ్.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సీఎం ఆరా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నాటి నుండి కొనసాగుతున్న హోరాహోరీ ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ (Congress) తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. ప్రచారం ఆఖరి రోజు కావడంతో 8 జిల్లాలో తన ప్రచారం ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం మంత్రులతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ (Zoom Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న సానుకూలత, ప్రతిపక్షాల ఎత్తుగడలు మరియు ఓటర్ల నాడిని మంత్రులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రులకు సీఎం దిశానిర్దేశం..

ప్రచారం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ (Polling) ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. ఎక్కడైనా అసమ్మతి, రెబల్స్ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు పోషించిన పాత్రపై సీఎం సమీక్షించారు. అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని, ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇవాళ సాయంత్రం మైకులు మూగవోనున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఈ భేటీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Next Story