health insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ ఇన్సిడెంట్ ఓసారి చదవండి

by Prasad Jukanti |   (  Updated:2026-02-04 13:31:54  IST  )

దేశంలో ఆన్ లైన్ లో ఆరోగ్య బీమా తీసుకుంటున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ హెచ్చరిక లాంటి ఘటన ఇది.

health insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ ఇన్సిడెంట్ ఓసారి చదవండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా మన దేశంలో ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరిగిపోతున్న వైద్య ఖర్చులను భరించేందుకు ఇదో పరిష్కార మార్గం కావడంతో ఆర్థిక నిపుణులతో పాటు వైద్యులు సైతం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రజల్లో వస్తున్న అవగాహన మేరకు ఆరోగ్య బీమా తీసుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతుంటే బీమా కంపెనీలు తమ పాలసీలు పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాయి. పాలసీ విక్రయించే సమయంలో కీలక విషయాలను తుంగలోకి తొక్కుతూ క్లెయిమ్ విషయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆరోగ్య బీమా ఉందన్న దీమాతో ఉన్న వారికి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు గుదిబండగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇటు కంపెనీలకు అటు పాలసీదారులను హెచ్చరికగా మారింది. దీంతో ఈ కేసులో జరిగినట్లు అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు కదా..? అందుకే ఈ కేసులో అసలేం జరిగింది.. పాలసీ కంపెనీలు ఎలా బురిడీ కొట్టిస్తున్నాయి? పాలసీ దారులు ఎక్కడ పప్పులో కాలేస్తున్నారో ఓ లుక్కేద్దామా?

అప్పుడు దాచిపెట్టారని ఇప్పుడు రిజెక్ట్:

తాజాగా జరిగిన ఘటన ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 18 ఏళ్ల వయసులో జరిగిన చికిత్సను దాచిపెట్టారని 64 ఏళ్ల వయసులో చేసిన క్లెయిమ్ ను ఓ బీమా సంస్థ తిరస్కరించడంపై హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే ఓ మహిళ కాళ్ల నొప్పులతో నడవలేక 2024 మే 25న ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు రూ.3 లక్షలకు పైగా ఖర్చు కాగా పాలసీ ద్వారా చికిత్సకు అయన డబ్బు చెల్లించాలని సదరు మహిళా బీమా సంస్థను ఆశ్రయిచారు. అయితే ఎప్పుడో 18 ఏళ్ల వయసులో తీసుకున్న చికిత్స, ఆరేల్ల క్రితం బ్రెయిన్ హేమరేజి కోసం పొందిన చికిత్సలను దాచిపెట్టి పాలసీ పొందినట్లు పేర్కొంటు సదరు బీమా సంస్థ ఆ మహిళ క్లెయిన్ ను తిరస్కరించింది. దీంతో చేసేదేమి లేక బాధితురాలు వినియోగదారుల కమిషన్-1 ను ఆశ్రయించారు. విచారణ జరిపిన కమిషన్ బీమా సంస్థ వైఖరిని తప్పుబట్టింది. క్లెయిన్ తిరస్కరణ అక్రమమని, సేవాలోపమని నిర్ధారించి చికిత్స ఖర్చులను సంబంధించిన రూ. 3,01,071 క్లెయిన్ ను, తరిస్కరించిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. నష్టపరిహారం రూ. 30 వేలు, ఖర్చులు రూ. 10 వేలను కూడా ఫిర్యాదుదారుకు చెల్లించాలని స్పష్టం చేసింది.

అంతా ఆన్ లైన్ తో చిక్కులే:

పై కేసులో బాధితురాలికి న్యాయం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీమా కంపెనీలు వేస్తున్న ఎత్తుగడలతో అన్ని వేళల ఇక్కడ జరిగినట్లే న్యాయం జరుగుతదా అనే సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల మార్కెట్‍లో పోటీ తత్వం పెరిగింది. కాంపిటేషన్ తట్టుకునేందుకు బీమా సంస్థలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆన్‍లైన్ పాలసీలు నిమిషాల వ్యవధిలోనే విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యక్తుల హెల్త్ ప్రొఫైల్స్ విషయంలో ఎలాంటి పట్టింపులు లేకుండా కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే కన్ఫర్మ్ చేసుకుని పాలసీలు ఇచ్చేస్తున్నాయి. ఇది పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారులకు సులభంగా ఉన్నప్పటికీ క్లెయిమ్ సమయంలో అనేక చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు ఏజెంట్ వ్యవస్థ ద్వారానే అంతా జరిగేది. దాంతో పాలసీదారు ఆరోగ్య వివరాలు, ఫిజికల్ గా ఆయన కండీషన్ అన్ని తెలుసుకుని పాలసీలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడంతా ఆన్ లైన్ ప్రక్రియ కావడంతో హెల్త్ విషయాలకు సంబంధించి కొన్ని సార్లు పాలసీదారులే ఉద్దేశపూర్వకంగా కొంత వరకు తప్పుడు సమాచారం ఇస్తుంటే, మరి కొన్ని సందర్భాల్లో కంపెనీలు ముఖ్యమైన వివరాలేవి పట్టించుకోకుండానే విక్రయిస్తున్నాయి. దీంతో అసలైన అవసరం వచ్చినప్పుడు బీమా కంపెనీలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

IRDAI ఏం చెబుతోంది?:

భారతదేశంలో బీమా రంగాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సంస్థ నియంత్రిస్తుంది. ఐఆర్‍డీఏఐ నియమాల ప్రకారం పాలసీ ప్రారంభమైన మొదటి 3 సంవత్సరాల్లో కంపెనీకి పాలసీని పరిశీలించి (దాచిపెట్టిన సమాచారం ఉంటే) రద్దు చేయడానికి హక్కు ఉంటుంది. కానీ పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత సాధారణంగా పాలసీని ప్రశ్నించలేరు. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు స్పష్టంగా తేలితే కంపెనీకి తరువాత కూడా పాలసీని రద్దు చేసే హక్కు ఉంటుంది. సాధారణంగా పాలసీ తీసుకునే సమయంలో తనకు ఉన్న అనారోగ్యాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే దాన్ని మెటీరియల్ నాన్-డిస్క్లోజర్/మిస్‌రిప్రెజెంటేషన్ గా పరిగణిస్తారు. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య వివరాలు పూర్తిగా నిజాయితీగా వెల్లడించడం చాలా ముఖ్యం. కానీ ఈ మేరకు పాలసీదారు ఆరోగ్య వివరాలు ఏ మేరకు వెల్లడి అవుతున్నాయనేది బీమా సంస్థలు, పాలసీదారులు ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిందే.

Next Story