తెలంగాణలో బీజేపీ వరుస విజయాలు.. అమిత్ షా రియాక్షన్ ఇదే

by Gantepaka Srikanth |

తెలంగాణలో క్రమ క్రమంగా బీజేపీ(Telangana BJP) పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నది.

తెలంగాణలో బీజేపీ వరుస విజయాలు.. అమిత్ షా రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో క్రమ క్రమంగా బీజేపీ(Telangana BJP) పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు, మొన్న టీచర్స్, నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి మాంచి ఊపుమీదున్నది. ప్రస్తుతం సగం తెలంగాణలో పట్టు సాధించినట్లు తెలుస్తున్నది. దీంతో తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను అభినందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ట్వీట్ పెట్టారు.

‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని అఖండ విజయంతో ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. మీ నమ్మకం మరింత కష్టపడి సేవ చేసేందుకు మాకు స్ఫూర్తినిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) చేస్తున్న అలుపెరుగని కృషికి దక్కిన విజయం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)తో పాటు పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేసినందుకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ అమిత్ షా ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని బీజేపీ గెలుచుకున్నది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య(Malka Komaraiah) తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. అలాగే.. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి(Anji Reddy) గెలుపొందారు.

Next Story