మహిళా రిజర్వేషన్ బిల్లుకు అంబేద్కర్ ఆశయాలే బలం: బీజేపీ నేతలు

by Ramesh Naini |

అంబేద్కర్ రాజ్యాంగ రచయిత మాత్రమే కాదని, సామాజిక న్యాయం, బలహీన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అంబేద్కర్ ఆశయాలే బలం: బీజేపీ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ​అంబేద్కర్ రాజ్యాంగ రచయిత మాత్రమే కాదని, సామాజిక న్యాయం, బలహీన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు. ఆయన కృషితో రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని, సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించే మార్గాన్ని చూపించారు. మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్​ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో అంబేద్కర్ ని పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి ఓడించడం, రాజ్యాంగ సభలో ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ చేసినవే.. చివరికి ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆయన అసెంబ్లీ లోకి ప్రవేశించాల్సి వచ్చిందన్నారు.1953లో నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో రిజర్వేషన్లు ప్రమాదకరమని పేర్కొన్నారు. 1961లో తాను ఏ రూపంలోనైనా రిజర్వేషన్లను ఇష్టపడను, ముఖ్యంగా ఉద్యోగాల్లో అని స్పష్టం చేశారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్న విషయాలేనన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ కు తగిన గౌరవం లభించిందని అన్నారు. ఆయన జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్య ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో గందరగోళం సృష్టించడం, అసత్య ప్రచారం చేస్తుందన్నారు. 2026 తర్వాత జరగబోయే సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2029 సాధారణ ఎన్నికల నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకోవడం కాదని మనసులో పెట్టుకొని ఆచరించాలని సూచించారు.

అంబేద్కర్ స్పూర్తితోనే మహిళా రిజర్వేషన్లు..

మహిళలకు సమానత్వ హక్కు కోసం పోరాడిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టబోతోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి.. అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే అంబేద్కర్ ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలన్నారు. అంబేద్కర్ స్పూర్తితోనే చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పార్లమెంట్ లో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. తనకు ప్రధాని పదవి రావడం అంబేద్కర్ పెట్టిన భిక్షేనని నిండు పార్లమెంట్ లో ప్రకటించిన ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంబేద్కర్ ను గౌరవించడమంటే ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడమే కాదు ఆయన ఆశయాలను కొనసాగించడం. బీజేపీ అదే బాటలో నడుస్తుందని చెప్పుకొచ్చారు.

Next Story