- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాన పార్టీలకు పోటీగా ప్రత్యామ్నాయ కూటమి
తెలంగాణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ కూటమి ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వేళ ఈ మూడు పార్టీలకు చెక్ పెట్టాలంటూ రాష్ట్రంలో మరో రాజకీయ కూటమి ఏర్పాటు కావడం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ రాజకీయ కూటమి పేరుతో తాజాగా ఓ కూటమి ఏర్పాటైంది. ఇవాళ ఈ కూటమి భాగస్వాములైన వివిధ పార్టీల ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్వరలో రాబోయే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవశ్యకతపై వక్తలు మాట్లాడారు.
ప్రధాన పార్టీలతో విరక్తి:
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చాలా మంది ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. అయితే దీనికి సరైన ప్రయత్నం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతో ప్రజలు విరక్తి చెందారని ప్రత్యామ్నాయ రాజకీయాల్లో భాగంగా కలిసి వచ్చే వారితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయం విషయంలో ఎన్నడూ సీపీఐ, సీపీఎం, ఎంఐఎం కలిసి రావు. కానీ గ్రామాల్లో ఉన్న మార్కిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న వారు అనేక మంది ఉన్నారని అలాంటి వారిని విద్యార్థుల సంఘాలు, రిటైర్డ్ సంఘాలతో పాటు వివిధ సంఘాలను కలుపుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణకు ఓ ఫిలాసపీ:
ఈ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ... తెలంగాణలో పోరాటాలు జరుగుతున్నాయి తప్ప న్యాయం జరగడం లేదని తెలంగాణకు సరిపడే రీతిలో ఒక రాజకీయ ఫిలాసఫీ రూపొందాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం ప్రధాన పార్టీలకు సిద్ధంతాలు, ఐడియాలజీ, మేనిఫెస్టోలు అంటూ ఏవి లేవని ప్రతిసారి బాధితుడే నష్టపోతున్నాడని చెప్పారు. 40-50 ఏళ్లు రాజకీయం చేసిన వారికి రాజకీయాలే తెలియని ప్రశాంత్ కిశోర్ లాంటి బ్రోకర్లు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల్లోని మేధావులు, రచయితలు, కళాకారులు ఎవరి డప్పు కొట్టవద్దు. మన డప్పు మనమే కొట్టుకుందామని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ లక్ష్మణ్, తెలంగాణ విఠల్, ప్రొ.గాలి వినోద్, రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, శరత్ తదితరులు పాల్గొన్నారు.






