కేజీబీవీ పాఠశాల టెండర్లలో రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు: బీఆర్ఎస్వీ ధర్నా

by Ramesh Naini |

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పాఠశాలల్లో బంకర్ బెడ్ల టెండర్లలో రూ.100 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) తీవ్ర ఆరోపణలు చేసింది.

కేజీబీవీ పాఠశాల టెండర్లలో రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు: బీఆర్ఎస్వీ ధర్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పాఠశాలల్లో బంకర్ బెడ్ల టెండర్లలో రూ.100 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కమిషన్ల కోసమే బంకర్ బెడ్ల ధరలను అసాధారణంగా పెంచారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్రిక్త వాతావరణం

ధర్నా సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థి నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఎడ్యుకేషన్ కార్యాలయం పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, భారీగా పోలీసులు మోహరించారు. కేజీబీవీ టెండర్ల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది.

Next Story