పర్యాటకులకు అలర్ట్.. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-29 07:13:48  IST  )

గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు (Nagarjuna Sagar Project) వరద ప్రవాహం కొనసాగుతోంది.

పర్యాటకులకు అలర్ట్.. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు (Nagarjuna Sagar Project) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకుగాను.. జూరాల, శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో 2,01,743 క్యూసెక్కులు వస్తుండడంతో ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. దీంతో ఇవాళ (జులై 29) ఉదయం 11:30 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలతో కలిసి కృష్ణమ్మకు పూజలు నిర్వహించి, ప్రాజెక్టు 13, 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. మొత్తం 8 (10, 11, 12, 13, 14, 15, 16, 17) 8 ఫీట్లు పైకి ఎత్తి 68 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు నాగర్జున సాగర్‌కు క్యూ కడుతున్నారు. పాల‌ పొంగులాంటి నీటి దృశ్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధించుకుంటున్నారు. కాగా, సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాగర్ జలకళను సంతరించుకుంటుండగా.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో సాగర్ గేట్లను ఎత్తటం విశేషం.

Read More: సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉంది: మంత్రి ఉత్తమ్

Next Story