- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మసిస్ట్ అభ్యర్థులకు అలర్ట్ : ఫలితాల విడుదలలో ఆలస్యం ఎందుకంటే?
హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడం వల్లే ఫార్మసిస్ట్ పోస్టుల ఫలితాల విడుదలలో ఆలస్యం జరుగుతోందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడం వల్లే ఫార్మసిస్ట్ పోస్టుల ఫలితాల విడుదలలో ఆలస్యం జరుగుతోందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తెలిపింది. హైకోర్టు తుది తీర్పు వెలువడకుండా ఫలితాలు ప్రకటిస్తే, రిక్రూట్‌మెంట్ పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఫార్మసీ అభ్యర్థులు అర్థం చేసుకోవాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. కోర్టు తుది తీర్పు తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని బుధవారం ఓ ప్రకటనలో బోర్డు స్పష్టం చేసింది. 732 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టులకు 24 సెప్టెంబర్ 2024న నోటిఫికేషన్ విడుదల చేయగా.. 27,101 దరఖాస్తులు వచ్చాయని బోర్డు వెల్లడించింది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 100 మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని, అందులో 80 మార్కులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కి, 20 మార్కులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ సేవల అనుభవానికి కేటాయించామని బోర్డు వివరించింది. కంప్యూటర్ బేస్‌డ్ టెస్టును 2024 నవంబర్‌లో నిర్వహించామని, డిసెంబర్‌లో ప్రిలిమినరీ కీ విడుదల పరీక్షను 30 నవంబర్ 2024న నిర్వహించారు. ప్రిలిమినరీ కీ విడుదల చేసి, 2025 మే నెలలో ఫలితాలను ప్రకటించామని గుర్తు చేసింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సర్వీస్‌కు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిందని వెల్లడించింది.
హైకోర్టులో పిటిషన్ వల్ల..
ఇదే సమయంలో కొంతమంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఫార్మసిస్టులు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూనే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కూడా ఫార్మసిస్టులుగా నమోదు అయ్యారని ఆరోపిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అలాంటి అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, ఫార్మసీ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని నిబంధనలకు ఇది విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు స్పందిస్తూ.. హైకోర్టు తుది తీర్పునకు లోబడే రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయం కోరగా, విషయం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉండి మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నందున తదుపరి కోర్టు ఆదేశాలను అనుసరించడం సముచితమని న్యాయ నిపుణులు సూచించారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతే, ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు బోర్డు వెల్లడించింది. ఈ అంశాన్ని అభ్యర్థులు సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. ఈ రెండేళ్లలో ఆరోగ్యశాఖలో సుమారు 12,650 పోస్టుల భర్తీ జరిగిందని బోర్డు గుర్తు చేసింది. హైకోర్టులో తుది తీర్పు వెలువడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని బోర్డు తెలిపింది.






