ఇద్దరు బిల్డర్ల విధ్వంసం.. తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప్రజ‌లు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గాలి నాణ్యత చాలా కలుషితంగా మారింది. తాజాగా అక్కడి ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ను పరిశీలించగా 342గా నమోదైంది.

ఇద్దరు బిల్డర్ల విధ్వంసం.. తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప్రజ‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గాలి నాణ్యత చాలా కలుషితంగా మారింది. తాజాగా అక్కడి ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ను పరిశీలించగా 342గా నమోదైంది. మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్ వీధిలో ఉన్న ఇద్దరు బిల్డర్లు చేస్తున్న విధ్వంసమే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. అందులో ఒకటి సియా బిల్డర్స్, మరొకటి ప్రైమార్క్ బిల్డర్స్. ఈ రెండు నిర్మాణ‌ సంస్థల నిర్లక్ష్యం వలన చుట్టుప‌క్కల ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అటు పీసీబీ అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడి ప్రజల స‌మ‌స్యను పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సియా బిల్డర్స్, ప్రైమార్క్ కంపెనీలు గ‌త కొంత‌కాలంగా అపార్టుమెంట్లను నిర్మిస్తున్నాయి. ఆరంభం నుంచీ ఈ సంస్థలు క‌నీస ప్రమాణాల్ని పాటించ‌డం లేదు. ఎలాంటి ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకోకుండా చుట్టుప‌క్కల ప్రాంతాల్లో బాంబుల మోత మోగించారు. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ‌చ్చినా.. రాత్రింబ‌వ‌ళ్లు ప‌నుల్ని కొనసాగిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడేమో నిర్మాణ టైంలో కనీస భద్రతా ప్రమాణాల్ని పాటించ‌డం లేదు. అపార్ట్మెంట్ కట్టేటప్పుడు పక్క అపార్టుమెంట్ల మీద దుమ్ము, ధూళి పడకుండా చర్యల్ని తీసుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో పెద్దలు, చిన్నారులు, మ‌హిళ‌ల‌కు శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్యలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు సంస్థలు వెద‌జ‌ల్లే కాలుష్య తీవ్రతను చూస్తే ఎవ‌రైనా ఆశ్చర్యపోవాల్సిందే. గాలి ప్రమాణ నాణ్యత ఇక్కడ 342గా న‌మోదైంది.

ఎందుకు ఉదాసీనత?

మియాపూర్‌లో ఆ రెండు కంపెనీలపై జీహెచ్ఎంసీ, పీసీబీ అధికారులెవరూ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఏనాడూ ఈ డెవలపర్స్‌ని పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిసింది. ప్రభుత్వ సిబ్బంది చూసీ చూడనట్లు వదిలేయడం వలన ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇదే కొన‌సాగితే మియాపూర్ ప్రాంత‌మంతా ఇదే దుస్థితి త‌లెత్తే ప్రమాద‌ముంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌ల‌తో నిత్యం న‌ర‌కం అనుభ‌విస్తున్న జనం.. ఇక్కడి గాలి కాలుష్యం కార‌ణంగా హ‌డ‌లెత్తిపోతున్నారు. పీసీబీ అధికారులు, చందానగర్ మునిసిపల్ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని ప్రజలు కోరుతున్నారు.

డస్ట్ ప్రూఫ్ షీట్స్ అమర్చండి..

తాము ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం. భయంకరమైన దుమ్ము, ధూళి ఇండ్లల్లోకి వస్తుంది. ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతంలో నిరంతరం పనులు జరుగుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. పొరుగున ఉన్న తమతో మంచి రిలేషన్ ఉంచుకోవాలని, ఇక్కడ నివాసం ఉంటున్న వారికి సేఫ్ లైవ్ లీ హుడ్ ఉండేటట్లుగా చర్యలు తీసుకోండి. ఇలాగే దుమ్ముతో ఉంటే తామంతా అనారోగ్యానికి గురవుతామంటూ గత డిసెంబరు 10న ఎస్ఐఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సైట్ మేనేజర్‌కి లిఖితపూర్వకంగా పక్కనే ఉన్న అపార్టుమెంట్‌వాసులు ఇచ్చారు. వెంటనే డస్ట్ ప్రూఫ్ షీట్స్ పెట్టాలని కోరారు. కానీ, నేటికీ ఏర్పాటు చేయలేకోపోవడం వల్ల గాలి కాలుష్యం పెరిగి ఎంతో మంది అనారోగ్యానికి గురైనట్లు అపార్టుమెంట్ వాసులు వాపోతున్నారు. నార్నే ఆర్చ్ నుంచి ప్రాజెక్టు వరకు రోడ్లు ధ్వంసం చేశారు. నిర్మాణ ప్రాంతానికి భారీ వాహనాలు రోజూ అత్యధికంగా రావడం వల్ల చెడిపోయాయి. వెంటనే మరమ్మత్తు చేయించాలని ఎస్ఐఏ సైట్ మేనేజర్‌కి జనవరి 23న కూడా లిఖితపూర్వకంగా రిక్వెస్ట్ చేశాం. ఐనా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులకు మొర..

నార్నే ఆర్చ్ దగ్గరలో చేపట్టిన ప్రాజెక్టు కోసం ఇష్టారీతన బాంబ్ బ్లాస్టింగ్ చేపడుతున్నారని, సెల్లార్ల తవ్వకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని 2022 జూన్ 28న మియాపూర్ పోలీస్ ఇన్‌‌స్పెక్టర్‌కి పక్కనే ఉన్న అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. సదరు కాంట్రాక్టర్‌ను కలిసి పలుమార్లు రిక్వెస్ట్ చేసినా ఆయన పట్టించుకోవడం లేదని, కనీసం రాత్రి 10 తర్వాతైనా పనులు నిలిపివేయాలని కోరినా వినిపించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రై మార్క్, ఇతర నిర్మాణ సంస్థలు రాత్రింబవళ్లు తేడా లేకుండా పనులు చేపట్టడం వల్ల తాము ధ్వని, గాలి కాలుష్యంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్లు పోలీసులకు మొర పెట్టుకున్నారు. సెల్లార్ల తవ్వకాల్లోనూ పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్టింగ్స్ చేపట్టడం వల్ల తమ అపార్టుమెంట్లకు నష్టం వాటిల్లుతుందని, కాలుష్యంతో బతకలేకపోతున్నామన్నారు. అపార్టుమెంట్లల్లో యూకే, యూఎస్ఏ, యూరోప్ టైమింగ్స్ ప్రకారం వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న వారు చాలామంది ఉన్నారని, వారందరికీ తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కనీసం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పొల్యూషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్, 2000 ప్రకారం 55 డెసిబుల్స్ దాటకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Next Story