గాలి కాలుష్యం తగ్గి, ధ్వని కాలుష్యం పెరిగి.. దీపావళి వేళ హైదరాబాద్ పరిస్థితి ఇదే!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-22 07:51:10  IST  )

గాలి కాలుష్యం తగ్గి, ధ్వని కాలుష్యం పెరిగి.. దీపావళి వేళ హైదరాబాద్ పరిస్థితి ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళి సందర్భంగా కాలుష్యం తగ్గుముఖం పట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి పెద్దగా ప్రభావంలేదని పీసీబీ అధికారులు సైతం చెబుతున్నారు. అయితే ఈ సారి గాలి కాలుష్యం తగ్గడంతోపాటు వాయు కాలుష్యం నియంత్రణలోనే ఉంది. ధ్వని కాలుష్యం మాత్రం సాధారణం కంటే స్వల్పంగా పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీపావళికి గాలి నాణ్యత, శబ్ద కాలుష్యాన్ని సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు 15రోజులపాటు పర్యవేక్క్షించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈనెల 13 నుంచి 27వ తేది వరకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే దీపావళి నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణలో గాలి, శబ్ధ డేటా విశ్లేషించింది. టీజీపీసీబీ విశ్లేషణ ప్రకారం కాలుష్యం ప్రభావం తగ్గిందని చెబుతున్నారు.

గాలి కాలుష్యం…

హైదరాబాద్ నగరంలో 24గంటల్లో గాలి నాణ్యతను పీబీసీ అధికారులు పరిశీలించారు. సాధారణ రోజుతో పోలిస్తే 2024లో PM2.5 సాంద్రతలు 91శాతం, 2025లో 86శాతం పెరిగాయి. సాధారణ రోజుతో పోలిస్తే 2024లో PM10 సాంద్రతలు 65.76శాతం, 2025లో 68.13శాతం పెరిగాయి. కానీ 2025 నాటి PM2.5 , PM10 విలువలు 2024 దీపావళికి ముందు, దీపావళి రోజు కంటే తక్కువగా ఉన్నాయి. అంటే గతేడాది కంటే గాలి నాణ్యత సాధారణంగా ఉందని, కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు.


వాయువులు….

సాధారణంగా దీపావళి సందర్భంగా గాలిలో సల్ఫర్ డయాక్సైడ్(SO2), నైట్రోజన్ ఆక్సైడ్(NO2) పెరుగుతాయి. కానీ ఈ సారి దీపావళికి ముందు ఉన్న వాటితో పోలిస్తే దీపావళి రోజున సాంద్రతలు టీజీపీసీబీ సూచించిన ప్రమాణాల పరిధిలోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.



పెరిగిన శబ్ద కాలుష్యం …

దీపావళి నేపథ్యంలో శబ్ధ కాలుష్యం పెరిగింది. పీసీబీ సూచించిన ప్రమాణాల ప్రకారం తగ్గిన.. గతేడాది కంటే మాత్రం పెరిగింది. ఈ శబ్ద కాలుష్యాన్ని 8 ప్రాంతాలకుగాను రెండు పారిశ్రామికవాడలు, రెండు కమర్షియల్ ప్రాంతాలు, మూడు రెసిడెన్షియల్, ఒక సెన్సిటివ్ ప్రాంతాల్లో పీసీబీ శబ్ధ కాలుష్యాన్ని పర్యవేక్షించింది. పారిశ్రామికవాడలో పగలు 75, రాత్రి 70 డీబీ ఉండాలి. అదే కమర్షియల్ ఏరియాలో పగలు 65, రాత్రి 55, రెసిడెన్షియల్ ఏరియాలో పగలు 55, రాత్రి 45, సెన్సిటివ్ జోన్ లో అయితే పగలు50, రాత్రి 40 డెసిబుల్స్ మాత్రమే ఉండాలి. అయిదే దీపావళి సందర్భంగా శబ్ధ కాలుష్యం పెరిగింది. అయితే పారిశ్రామిక ప్రాంతంలో దీపావళికి ముందు, దీపావళి రోజుతో పోలిస్తే పగటిపూట శబ్ద స్థాయిలు 3.1డీబీ, రాత్రిపూట 6.2డీబీ ఎక్కువగా ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతంలో దీపావళి సమయంలో శబ్ద స్థాయిలు పగటిపూట 2.5డీబీ, సాధారణ రోజుతో పోలిస్తే రాత్రిపూట 3.97డీబీ పెరిగాయి. రెసిడెన్షియల్ ఏరియాలో శబ్ద స్థాయిలు సాధారణ రోజుతో పోలిస్తే పగటిపూట 1.6డీబీ, రాత్రిపూట 3.7డీబీ పెరిగాయి. సున్నితమైన ప్రాంతంలో శబ్ద స్థాయిలు సాధారణ రోజుతో పోలిస్తే పగటిపూట 1.1డీబీ, రాత్రిపూట 4డెసిబుల్స్ పెరిగాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సారి శబ్ధ కాలుష్యం తగ్గిందే చెప్పాలి. 2024లో పారిశ్రామిక ప్రాంతం పగలు 3.5 డీబీ, రాత్రి 2.9డీబీ వాణిజ్య ప్రాంతంలో పగలు 6.64 డీబీ, రాత్రి 7.15డీబీ, రెసిడెన్షియల్ ఏరియాలో పగలు 4.86డీబీ, రాత్రి 5 డీబీ, సున్నితమైన ప్రాంతంలో పగటి సమయం కంటే 0.8డెసిబుల్స్ ఎక్కువ, రాత్రి సమయంలో 3 డెసిబుల్స్ తక్కువ నమోదైందని అధికారులు చెబుతున్నారు.

Next Story