T congress: మేడం సింప్లిసిటీ సూపర్.. మీనాక్షినటరాజన్ కు నెటిజన్ల ప్రశంసలు

by Prasad Jukanti |   (  Updated:2025-02-28 06:29:40  IST  )

తెలంగాణ రాష్ట్ర నూతన వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సాధారణ జీవితం అందరిని ఆశ్చర్యపరుస్తున్నది.

T congress: మేడం సింప్లిసిటీ సూపర్..  మీనాక్షినటరాజన్ కు నెటిజన్ల ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి (AICC Incharge) హోదాలో మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు. రైలు మార్గం ద్వారా ప్రయాణమై వచ్చిన ఆమె ఇవాళ ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆమెకు టీపీసీసీ చీఫ్ (PCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయనతో పాటు ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్లు సిద్ధేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు మీనాక్షికి స్వాగతం పలికారు. అయితే మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. హంగు ఆర్భాటాలకు తాను దూరం అని రాష్ట్ర నేతలకు మీనాక్షి నటరాజన్ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆమె సాధారణ రీతిలో హైదరాబాద్ కు రావడం ఆసక్తిగా మారింది.

ఢిల్లీ దూతగా వస్తున్న మీనాక్షి నటరాజన్ ఫ్లైట్ లో కాకుండా రైలులో రావడం తన లగేజీ బ్యాగ్ ను తనే మోసుకుంటూ తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలతో ముచ్చటించడం అందరిని ఆశ్చర్యపరిచింది. గల్లీ స్థాయి లీడర్లే హంగు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్న ఈ రోజుల్లో రాహుల్ గాంధీ టీమ్ లో కీలక సభ్యురాలు, మాజీ ఎంపీ, తెలంగాణలో అధికార పార్టీకి ఇన్ చార్జిగా ఉంటూ మీనాక్షి నటరాజన్ మాత్రం తాను చెప్పినట్లుగా ఆర్భాటాలకు దూరంగా సాధారణంగానే తన పర్యటన కొనసాగిస్తుండటంతో మేడం సింప్లిసిటీ (Meenakshi Simplicity) ఇటు పార్టీలో అటు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. ఇక తన పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, గోడ పత్రికలు ఏర్పాటు చేయవద్దని తనకు ఏసీ రూమ్ లు, హోటల్స్ వద్దని రాష్ట్ర నేతలకు ఆమె ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ టూర్ లో భాగంగా ప్రభుత్వ అతిథి గృహం దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో నివాసం ఉండబోతున్నారు. ఇక హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.

మేడం తొలి సందేశంపై ఉత్కంఠ:

రాష్ట్ర ఇన్ చార్జిగా నియామకమైన మీనాక్షి నటరాజన్ ఇప్పటికే రాష్ట్ర నేతలతో రెండు మూడు జూమ్ మీటింగ్స్ లకు అటెండ్ అయ్యారు. కానీ ఇవాళ ప్రత్యక్షంగా తొలిసారి హైదరాబాద్ కు రావడంతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఈ మీటింగ్ కు అటెండ్ కాబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో అభ్యర్థుల విషయంపై చర్చించే అవకాశం ఉంది. అధిష్టానం దూతగా తొలిసారి రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు? పార్టీ నేతలకు ఏ రకమైన దిశానిర్దేశం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మీనాక్షి నటరాజన్ ముక్కుసూటిగా మాట్లాడతారనే అభిప్రాయాలు ఉండటంతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం కఠిన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా అనేది ఉత్కంఠగా మారింది.

కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు లేవు:

మాపార్టీలో అంతర్గత రాజకీయాలు లేవని మీనాక్షి నటరాజన్ అన్నారు. హైదరాబాద్ కు చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పనిచేయడానికి.. ఖర్గే, రాహుల్‌ ఇచ్చిన బాధ్యతలు నెరువేరుస్తానని రాహుల్‌ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు.

Next Story