- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ
పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) శిక్షణను అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) శిక్షణను అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం పెద్దపల్లి కలెక్టర్, అధికారులు, టీ-ఫైబర్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో జిల్లావ్యాప్తంగా ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా ఆధునిక ఏఐ పరిజ్ఞానంపై శిక్షణ అందించనున్నారు. ముఖ్యంగా ఏఐ పునాది భావనలు, డిజిటల్ లిటరసీ, ఏఐ టూల్స్ వినియోగం, డిజిటల్ సిటిజన్‌షిప్ వంటి అంశాలపై నిర్మిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల అడవిశ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామీణ ఏఐ ల్యాబ్ విజయవంతమైన నేపథ్యంలో అదే మోడల్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
సమర్థంగా ఏఐ టెక్నాలజీ
ఈ కార్యక్రమం అమలైతే వేలాది మంది విద్యార్థులు ఏఐ ఆధారిత విద్యను పొందే అవకాశం దొరుకుతుంది. ఏఐ శిక్షణను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఏఐ టెక్నాలజీని సమర్థంగా వినియోగించి విద్యార్థులకు ఆధునిక విద్య అందిస్తారు. కాగా.. ఈ సమావేశంలో జిల్లాలో దశల వారీ కార్యాచరణ, అవసరమైన సదుపాయాలపై చర్చించారు. త్వరలో పూర్తి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. అందులోభాగంగా వచ్చే వేసవిలో దీనిని అమలు చేసే దిశగా ప్రణాళికను రూపొందించారు. వేసవి సెలవుల్లో లేదంటే.. వేసవి సెలవులు ముగిసి స్కూల్స్ ప్రారంభం అయ్యే సమయంలోనైనా శిక్షణను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలైతే పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్, ఏఐ విద్యలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.






