- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పట్టణాల్లో ‘AI’ విప్లవం.. ఇక నిమిషాల్లోనే బిల్డింగ్ పర్మీషన్లు!
తెలంగాణలో పెరుగుతున్న పట్టణీకరణపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే AI ఆధారిత బిల్డింగ్ పర్మిషన్లు, అమృత్ 2.0 కింద రూ. 9,584 కోట్ల ప్రాజెక్టులు, 3D డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పట్టణ జనాభానే 50 శాతానికి చేరింది. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోనే 2.78 కోట్లకు చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో పట్టణాలపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
కేంద్ర ప్రభుత్వ పథకాలు
కేంద్ర పథకమైన ‘అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (అమృత్ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వినియోగించుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2025లో రూ.9,584 కోట్లతో కూడిన 252 ప్రాజెక్టులకు అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,789 కోట్లను కేటాయించింది. దీంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 ద్వారా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. అందులో భాగంగానే 101 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రూ.3,705 కోట్లతో 115 మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం సైతం
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ద్వారా భారీగా నిధులు కేటాయించింది. మొదటి దశలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టుల కోసం రూ.622.84 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రెండో దశలో పలు పట్టణ స్థానిక సంస్థల్లో 8 తాగునీటి సరఫరా ప్రాజెక్టులు, 9 అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టుల కోసం రూ.1,733 కోట్లు మంజూరు చేసింది. మూడో దశలో 47 యూఎల్బీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు అదనంగా రూ.1,182.25 కోట్లకు పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.
మహిళా సాధికారత లక్ష్యం
20,876 మహిళా సంఘాలకు రూ.2,678 కోట్ల రుణాలను అందజేయడంతోపాటు జీవనోపాధి కార్యక్రమాలను నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 7,386 సంఘాలను ఏర్పాటు చేశారు. 17,068 సంఘాలకు రూ.2,174 కోట్ల రుణాలు అందజేశారు.
ఏఐ ఆధారిత నిర్మాణ అనుమతులు
పట్టణ ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత బిల్డింగ్ పర్మిషన్లను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డ్ నౌ సాఫ్ట్ వేర్ ద్వారా 1.31 నిమిషాల్లో 24 లక్షల చదరపు అడుగుల్లో 66 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ జారీ చేశారు. దీంతోపాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, వరదల నివారణకు ఫ్లడ్ మోడలింగ్, భూ వినియోగ ప్రణాళిక వంటి వాటి కోసం త్రీడీ డిజిటల్ ట్విన్ డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం లైడార్, డ్రోన్ల ద్వారా సర్వే చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.






