- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసుపు మనకు కొత్త పంట కాదు: మంత్రి తుమ్మల
పసుపు మనకు కొత్త పంట కాదు: మంత్రి తుమ్మల

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం CII తెలంగాణ మరియు నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యు చైన్ సమ్మిట్ – 2025లో పాల్గొన్న మంత్రి, పసుపు రైతుల సంక్షేమం, విలువ జోడింపు, ఎగుమతుల అవకాశాలపై విస్తృతంగా మాట్లాడారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన Telangana Rising Global Summit లో Agri Vision 2047ను ప్రకటించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విజన్‌లో వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్‌గా చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకి కూడా పాత్ర ఉందని మంత్రి అన్నారు. పసుపు మనకు కొత్త పంట కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమై ఉందని మంత్రి అన్నారు. వంటింటికే పరిమితం కాకుండా, మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్, ఫంక్షనల్ ఫుడ్స్ వంటి రంగాల్లో పసుపు వినియోగం పెరుగుతోందని వివరించారు.
'ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో భారత్ అగ్రస్థానంలో ఉంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. పసుపును అధికంగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆర్మూర్ పసుపుకు GI ట్యాగ్ రావడం తెలంగాణ రైతులకు గర్వకారణం” అని మంత్రి అన్నారు. నిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
బోర్డు కార్యాలయ పరిమితుల్లో కాకుండా, రైతులకు పాలసీ దిశ చూపే సంస్థగా పనిచేయాలని, పరిశోధనను రైతు పొలాలకు తీసుకెళ్లాలని, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల్లో నాయకత్వం వహించాలని కోరారు. సమావేశంలో టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ, సిఐఐ తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, అగ్రి యూనివర్సిటీ మాజీ విసి ప్రవీణ్ రావు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్, సింథైట్ ఇండస్ట్రీస్ స్ట్రాటజిక్ సోర్సింగ్ హెడ్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.






