ప్రతికూల వాతావరణం.. శంషాబాద్‌కు రావాల్సిన 2 విమానాల దారి మళ్లింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-14 04:24:59  IST  )

హైదరాబాద్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన రెండు విమానాలను విజయవాడ, బెంగళూరుకు దారి మళ్లించారు.

ప్రతికూల వాతావరణం.. శంషాబాద్‌కు రావాల్సిన 2 విమానాల దారి మళ్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) రావాల్సిన 2 విమానాలను అధికారులు ఇతర నగరాలకు దారి మళ్లించారు. నగర శివారు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, ల్యాండింగ్‌కు విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. పుణె నుంచి రావాల్సిన ఇండిగో (Indigo) విమానాన్ని అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించి అక్కడ ల్యాండింగ్ చేయించారు. అదేవిధంగా దుబాయ్‌ నుంచి హైదరాబాద్ రావాల్సిన అంతర్జాతీయ సర్వీస్ ఎమిరేట్స్ (Emirates) విమానాన్ని అధికారులు బెంగళూరు విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు. వాతావరణం సద్దుమణిగిన తర్వాత, ఆ రెండు విమానాలు తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Next Story