హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు.. నిర్వాహకుడి అరెస్ట్

by Ramesh Naini |

నగరంలోని ముషీరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు.. నిర్వాహకుడి అరెస్ట్
X

దిశ డైనమిక్ బ్యూరో: నగరంలోని ముషీరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్స్), హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బాపూజీనగర్‌లోని ‘బ్లూ బెల్స్ ఐస్‌క్రీమ్’ (Blue Bells Ice Cream) ఫ్యాక్టరీలో ఈ తనిఖీలు చేపట్టారు.

కల్తీ పదార్థాల వినియోగం..

ఈ దాడుల్లో గడువు ముగిసిన (Expired) పైనాపిల్, సీతాఫలం ఫ్లేవర్లతో పాటు, ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతూ మ్యాంగో, వెనీలా, బట్టర్ స్కాచ్, మలై కుల్ఫీ తదితర రకాల ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నాణ్యత లేని ముడిసరుకుతో ఈ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి.. బ్రాండెడ్ ఉత్పత్తులుగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రూ.1.75 లక్షల సరుకు సీజ్..

ఈ దాడుల్లో సుమారు రూ.1,75,000 విలువైన కల్తీ ఐస్‌క్రీమ్‌లు, రసాయన రంగులు, గడువు ముగిసిన ముడిపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా, కల్తీ వ్యాపారం చేస్తున్న ఫ్యాక్టరీ నిర్వాహకుడు పట్టాల అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్లు 125, 318(4) (Cr. No.118/2026) కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)కు అప్పగించారు.

Next Story