- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వసంత పంచమి వేడుకల్లో అడ్మిషన్ల వెల్లువ
విద్యా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది. వార్షిక పరీక్షల సందడి మొదలవ్వక ముందే వచ్చే విద్యా సంవత్సరానికి కార్పోరేట్ కాలేజీలు, స్కూళ్లు అడ్మిషన్ల జాతరను ప్రారంభించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది. వార్షిక పరీక్షల సందడి మొదలవ్వక ముందే వచ్చే విద్యా సంవత్సరానికి కార్పోరేట్ కాలేజీలు, స్కూళ్లు అడ్మిషన్ల జాతరను ప్రారంభించాయి. శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర పర్వదినాన అక్షరాభ్యాసం చేయించడం శుభసూచకమని భావించే తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను బడిలో చేర్పించడంతో విద్యాసంస్థలన్నీ అడ్మిషన్లతో కిక్కిరిసిపోయాయి. ఇది నాణానికి ఒక వైపు కాగా వేసవి సెలవుల్లో మొదలవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ జనవరి నుంచే మొదలైంది. సిలబస్ పూర్తి కాకముందే సీట్ల ఉండవు అని చెబుతూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. విద్యా సంస్థలు పోటీ పడి మరి అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా పాఠశాల విద్యా శాఖ, ఇంటర్ బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారీగా అడ్మిషన్లు.. ఇంటింటికీ ప్రచారం
ఈ ఏడాది వసంత పంచమి అడ్మిషన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. విద్యాసంస్థల సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి తమ పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యా ప్రమాణాల గురించి వివరిస్తున్నారు. పవిత్రమైన ఈ రోజున చేరిన విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు, ఉచిత ప్రవేశాలు కల్పిస్తూ యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రధాన పట్టణాల్లో సైతం భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, మెట్రో రైళ్లలో ప్రకటనలు, సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో అడ్మిషన్ల ప్రకటనలు ఆగడం లేదు. నిబంధన ప్రకారం వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించాకే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంటుంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. 80 శాతం విద్యార్థులు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లోనే జాయిన్ అవుతున్నారు. తమ పిల్లల భవిష్యతు ద్రుష్ట్యా మంచి స్కూల్ లో సీటు దొరకదేమోనన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు ముందస్తు అడ్మిషన్ల వలలో పడుతున్నారు. డిస్కౌంట్ పేరిట వేల రూపాయలు చెల్లిస్తున్నారు.
అధికారులకు తెలిసే అడ్మిషన్లు:
అనుమతులు లేని పాఠశాలలు, కాలేజీలు ప్రచారం నిర్వహిస్తున్నా, నిబంధనలకు విరుద్దంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయా జిల్లాల డిఐఈఓలకు , డీఈఓలకు భారీగానే ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాల్లోని ఎక్సలెన్షియా కాలేజీకి భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఆయా కాలేజీలపై సీజేఎస్ చేసిన ఫిర్యాదులపై రంగారెడ్డి డీఐఈఓ చేపడతామని పేర్కొన్నారు. అంటే క్షేత్ర స్థాయిలో అడ్మిషన్ల పర్వం ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.






