ఎవరి ధీమా వారిదే..! మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి..?

by I. Sairam |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ముగిసిన పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది.

ఎవరి ధీమా వారిదే..! మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి..?
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ముగిసిన పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది. మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మెజారిటీ మున్సిపాలిటీల్లో హస్తం పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. అయితే, ఆదిలాబాద్‌లో బీజేపీ, కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ గట్టి పోటీని ఇస్తుండగా, నాలుగు పురపాలక సంఘాల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఇక్కడ చైర్మన్ పీఠాలను నిర్ణయించడంలో కీలకం కానుంది. రేపు వెలువడనున్న ఫలితాల కోసం అభ్యర్థులతోపాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

దిశ, నిర్మల్ ప్రతినిధి : బుధవారం ముగిసిన పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ పురపాలక సంఘాల కౌన్సిలర్ స్థానాలు హస్తం ఖాతాలో జమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల కార్పొరేషన్ సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా పురపాలక సంఘాల్లో హస్తం పార్టీ బలమైన ప్రభావం చూపనుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మూడు మున్సిపాలిటీలలో బీజేపీ, బీఆర్ఎస్ సైతం సత్తా చాటే ప్రయత్నాలు చేశాయి. చాపకింద నీరులా ఓటు బలంగా పడితే తప్పా ఏ ఒక్క మున్సిపాలిటీలో బీజేపీ స్పష్టంగా మెజారిటీ సాధించే పరిస్థితులు లేవు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ భావజాల ఎంఐఎం సహకారంతో కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇండిపెండెంట్లు సైతం అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని అభ్రిపాయం వ్యక్తం అవుతోంది. నాలుగుచోట్ల హంగ్ పుర పాలకవర్గాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మంచిర్యాల కార్పొరేషన్ సహా 4మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌పై చేయి...

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మొత్తంలో కార్పొరేటర్లను గెలిపించుకునే పరిస్థితి ఉందని ఆ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్న సంకేతాలు కనిపిస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి పురపాలక సంఘాల్లోనూ ఇదే వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేతన్‌పల్లి మున్సిపాలిటీలో కొంత సంక్లిష్టత ఉన్నట్లు చెబుతున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రభావం చూపిందని, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో సీట్ల సంఖ్య రీత్యా కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి అధికారం దక్కే పరిస్థితిలో లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ పరోక్షంగా బీఆర్ఎస్, బీజేపీ ఇండిపెండెంట్లు ఏకం అవుతున్నారని ప్రచారం మొదలైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మెజారిటీ సీట్లు బీజేపీకి దక్కుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆ పార్టీకి సింగిల్‌గా చైర్మన్ పదవి దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. ఇక నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్య రీత్యా ఆధిక్యత కనిపిస్తోంది. అలాగే ఎంఐఎం ఇండిపెండెంట్లు కొన్నిచోట్ల గెలిచే అవకాశాలు ఉండడంతో వారు సైతం అధికార పార్టీకి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం మొదలైంది. బైంసా పురపాలక సంఘంలో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం కనిపిస్తుండగా, బీజేపీ ఇండిపెండెంట్లు భారీగానే సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సమ ఉజ్జీలుగా సీట్లు పంచుకునే అవకాశాలు ఉన్నాయని అక్కడి పోలింగ్ సరలిని బట్టి తెలుస్తోంది.

రేపు తేలనున్న ఫలితాలు...

కాగా పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు శుక్రవారం తేలనున్నాయి. ఇందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు మంచిర్యాల కార్పొరేషన్ సహా అన్ని మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Next Story