రోడ్డు విస్తరణకు మోక్షం ఎప్పుడు..?

by Ratna Kumari |

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కోటపల్లి బస్టాండ్ చెరువు కట్ట వరకు గల రోడ్డు చిన్నదిగా ఉండడంతో పట్టణ ప్రజలు ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రోడ్డు విస్తరణకు మోక్షం ఎప్పుడు..?
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కోటపల్లి బస్టాండ్ చెరువు కట్ట వరకు గల రోడ్డు చిన్నదిగా ఉండడంతో పట్టణ ప్రజలు ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి గుండా కోటపల్లి, వేమనపల్లి మండలాలకు ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి. ఈ రెండు మండలాలకు చెందిన ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఇదే రహదారి గుండా రాకపోకలు కొనసాగిస్తుంటారు. రోడ్డు చిన్నదిగా ఉండడం మరోపక్క వాహనాల రద్దీ పెరగడంతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండడం రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో ప్రతిరోజు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రోడ్డు చిన్నదిగా ఉండడం మరోపక్క స‌రైన‌ పార్కింగ్ లేకపోవడంతో వాణిజ్య దుకాణాల యజమానులు తమ దుకాణాలను కొత్త బస్టాండ్ ప్రాంతం వైపు తరలించడానికి మోగ్గు చూపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే చేపట్టి ప్రజలకు సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చినారు. ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. గత నాలుగు నెలల క్రితం మున్సిపల్ అధికారులు ఎంతో హడావుడి సృష్టించి దుకాణ సముదాయాల ముందు ఉన్న తాత్కాలిక షెడ్లను తొలగించి రోడ్లు కొలతలు చేసి మార్కింగ్ కూడా చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తిరిగి ఎటువంటి పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. చెన్నూరు పట్టణం వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డు విస్తరణ పనులు తప్పనిసరి కాని స్థానిక నాయకులు అధికారులు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహించడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story